యూట్యూబ్ టిక్ టాక్ ద్వారా మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ ఒక్క తప్పుతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు సింపుల్ గా తన కామెడీ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ కామెడీ స్కిట్స్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కుర్రకారును ఆకర్షించాడు. భిన్నమైన పంచ్ డైలాగ్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
Fun Bucket Bhargav
అయితే 2021లో ఫన్ బకెట్ భార్గవ్‌పై 14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది. యూట్యూబ్ వీడియోల కోసం భార్గవ్‌తో కలిసి పనిచేసిన ఆ బాలికను చెల్లిగా పిలుస్తూ, నమ్మించి తన దగ్గరికి రప్పించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని కేసు నమోదు చేశారు.
ఈ విషయాన్ని గ్రహించిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించడంతో 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో భార్గవ్‌పై కేసు నమోదు చేశారు. ఇక ఇంత కాలం భార్గవ్ విచారణలో కొనసాగుతూ వచ్చాడు. కేసు అనంతరం బెయిల్ పై వచ్చిన తరువాత కూడా భార్గవ్ వీడియోలు చేశాడు. ఇక మహిళల భద్రత కోసం రూపొందించిన ‘దిశ’ చట్టం మరియు పోక్సో చట్టం కింద భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై విచారణ జరిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు 2024 డిసెంబర్ 1న తీర్పు ప్రకటించింది. కేసు పూర్తి విచారణ అనంతరం భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. భార్గవ్ వుమెనైజర్‌గా ప్రవర్తించాడని, తనతో పని చేసిన అమ్మాయిలను గౌరవించలేదని పలువురు బాధితులు తెలిపారు. మరి భార్గవ్ సన్నిహితులు ఈ కేసు విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.