జనవరి 10న సంక్రాంతి కానుకగా “గేమ్ ఛేంజర్” (Game Changer) సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani), ఎస్.జె.సూర్య (Anjali) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలదొక్కుకోలేకపోయింది. అవుట్ డేటెడ్ స్టోరీ, ఆసక్తికరమైన పాయింట్ లేకపోవడం అనేది సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. ముఖ్యంగా.. “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) దూకుడు ముందు ఈ చిత్రం నిలవలేకపోయింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళం, భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దాదాపు 100 కోట్ల రూపాయలకు కొనుక్కున్న విషయం తెలిసిందే.
అయితే.. “గేమ్ ఛేంజర్” ఓటీటీ రిలీజ్ ఫిబ్రవరి 7 అని ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. నిజానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. మరీ 28 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుందని ఊహించలేదు ఎవరు. భారీ బడ్జెట్ సినిమాలకు కనీసం 56 రోజుల టైమ్ ఫ్రేమ్ ఉండాలని చాలామంది పేర్కొన్నారు. కానీ.. గేమ్ ఛేంజర్ విషయంలో ఇలా జరగడం అనేది దిల్ రాజుకి తప్పలేదు. సినిమా విడుదల తేదీలను ఓటీటీ సంస్థలు ఫైనల్ చేస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే.
ఆ కంట్రోల్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ త్వరలోనే బయటపడుతుంది అని నిర్మాతలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ.. అది ఇప్పట్లో జరిగేలా లేదు. ఎందుకంటే.. నిర్మాతలను ఒకరకంగా సేవ్ చేస్తున్నది ఓటీటీ డీల్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఈ కారణంగా థియేటర్స్ నష్టపోతున్నాయి అనేది ఎవ్వరు కాదనలేని వాస్తవం. మరి ఓటీటీ/థియేటర్ ల నడుమ సఖ్యతను నిర్మాతలు ఎప్పడు ఒక దారికి తీసుకొస్తారో చూడాలి.