గంగవ్వ ఇప్పుడు పెద్ద యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్‌కి వచ్చాక అందరికీ అమ్మమ్మ, నాయనమ్మ అయిపోయింది. అయితే అది ఇప్పుడు మరి ఒకప్పుడు గంగవ్వ పడని ఇబ్బంది లేదు. చూడని కష్టం లేదు. ఐదేళ్లకే పెళ్లి అయ్యింది… అప్పటి నుంచీ ఆమె జీవితంలో కష్టాలే. ఆమె జీవితంలో పడిన కష్టాల గురించి గంగవ్వ శుక్రవారం మార్నింగ్ మస్తీలో చెప్పింది.
‘‘ఐదేళ్లప్పుడే నాకు పెళ్లి చేశారు. నాకు 17 ఏళ్లు వచ్చేసరికి కొడుకు పుట్టాడు. చాలా ఆనందంగా అనిపించింది. కానీ నా భర్త తాగి వచ్చి నన్ను తిట్టేవాడు, కొట్టేవాడు. అక్కడికి రెండేళ్లకు ఓ కూతురు పుట్టింది. ఈలోగా నేను మస్కట్ పోతా అని నా మొగుడు చెప్పాడు. అప్పు తెచ్చి ఇస్తే వెళ్లిపోతా అన్నాడు. వాడు వెళ్లిపోతే నాకు దెబ్బలైనా తగ్గుతాయని ఒప్పుకున్నా. ఇక్కడ ఏదో పని చేసి నా పిల్లలను సాకుతా అనుకున్నాను’’ అని చెప్పింది గంగవ్వ.
తన చిన్న కూతురు చనిపోయిన విషయం గురించి కూడా గంగవ్వ చెప్పింది. ‘‘నా చిన్న కూతురుకు ఓ రోజు అర్ధరాత్రి అనారోగ్యం చేసింది. ఫిట్స్ వచ్చింది. ఆస్పత్రికి వెళ్లాక నాకు బువ్వ లేదు, బట్ట లేదు, డబ్బులు లేవు. తీరా ఉదయం లేచి చూస్తే రెండో రోజు చూస్తే చనిపోయింది. నాకు ఆ విషయం తెలియక ఓ బస్సు ఎక్కా. కండక్టర్ చనిపోయిన పిల్లను చూసి .. శవంతో ఎక్కుతున్నావ్ అన్నాడు. దీంతో బస్సు దిగేశా. ఆటోకు 100 ఇచ్చి… ఊర్లో దిగా. ఊరంతా నాకు సాయం చేశారు’’అంటూ గంగవ్వ చెబుతూ ఏడ్చేసింది.’
ఇన్ని కష్టాలు పడింది కాబట్టే… గంగవ్వ ఇప్పుడు స్టార్ అయ్యింది. జీవితంలో కష్టాలు నేర్పించే పాఠాలు ఎవరూ నేర్పించరు అంటారు. అలా పాఠాలు నేర్చుకున్నవాళ్లు ఉన్నతస్థానాలకు ఎదుగుతారు అనడానికి గంగవ్వ ఓ ఉదాహరణ. ఏమంటారు!