బాలీవుడ్ నటి అలియాభట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి లాంటి స్టార్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 25న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అయితే మొదటి నుంచి ఈ సినిమా విషయంలో గంగూబాయి ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా గంగూబాయి దత్తపుత్రుడు బాబూ రావుజీ షా మరియు గంగూబాయి మనవరాలు భారతి ఈ సినిమా పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నా తల్లిని వేశ్యగా మార్చారు. ప్రజలు ఇప్పుడు మా అమ్మ గురించి చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు’ అని బాబూ రావుజీ షా ఆవేదన వ్యక్తం చేశారు. గంగూబాయి మనవరాలు మాట్లాడుతూ.. ‘డబ్బుపై దురాశతో మేకర్లు నా ఫ్యామిలీ పరువు తీశారు.
దాన్ని మేము అంగీకరించలేము. ప్రాజెక్ట్ తో ముందుకు సాగడానికి ముందు మీరు మా కుటుంబం అనుమతి అడగలేదు. మీరు పుస్తకం రాసేటప్పుడు మా వద్దకు రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి తీసుకోలేదు. నా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను ఎలా చూపిస్తున్నారు..?’ అంటూ నిలదీసింది. గతంలో కూడా ఈ సినిమాపై కోర్టులో కేసు పెట్టారు.
హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామటిపుర’ ఆధారంగా ‘గంగూబాయి కతియావాడి’ సినిమాను తెరకెక్కించారు. పెన్ స్టూడియోస్, బన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై జయంతిలాల్ గడా, సంజయ్ లీలా బన్సాలీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా విడుదల కానుంది.