1993 వ సంవత్సరంలో అర్జున్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘జంటిల్మెన్’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాబిన్ హుడ్ థీమ్ తో ఈ చిత్రం రూపొందింది. డైరెక్టర్ శంకర్ టేకింగ్,హీరో అర్జున్ యాక్షన్ ఎపిసోడ్స్, చరణ్ రాజ్ విలనిజం, రహమాన్ సంగీతం..కలగలిపి ‘జెంటిల్మెన్’ సినిమాని ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలబెట్టాయి. ఇదే చిత్రాన్ని మన మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్లో రీమేక్ చేశారు కూడా. అయితే అక్కడ అది అంతగా సక్సెస్ కాలేదు.
సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే.. ఈ చిత్రం నిర్మాత కుంజుమోహన్ ‘జెంటిల్మెన్’ కు సీక్వెల్ ఉంటుందని తాజాగా వెల్లడించారు. అయితే ‘జెంటిల్మెన్’ కు సీక్వెల్ ను తెరకెక్కించాలి అనే ఆలోచన శంకర్ కు లేదట. అదే స్క్రీన్ ప్లేతో సౌత్ లోని అన్ని భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. ‘జెంటిల్మెన్’ వంటి క్లాసిక్ మూవీకి సీక్వెల్ తీసి చెడగొట్టే ఆలోచన శంకర్ కు లేదట. ఇక అర్జున్ కూడా ఆ సీక్వెల్ లో హీరోగా నటిస్తే జనాలు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు.
దాంతో ఆ ఇద్దరూ లేని ‘జెంటిల్మెన్2’ కి హైప్ పెరగడం కూడా చాలా కష్టమనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సీక్వెల్లో తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ ఉన్న ఓ హీరో నటిస్తాడని.. ‘అభిమన్యుడు’ ‘హీరో’ చిత్రాల దర్శకుడు పి.ఎస్.మిత్రన్ ‘జెంటిల్మెన్2’ ని తెరకెక్కించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.