సోషల్ మీడియా అలవాటు పెరిగిపోవడంతో వెబ్ సిరీస్ ల హవా సాగుతోంది. కొన్ని సంస్థల వారు స్టార్స్ తో వెబ్ సిరీస్ రూపొందించి నెటిజనులు వినోదాన్ని అందిస్తున్నారు. అలాగే బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్ ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకురావడానికి పనులు మొదలయ్యాయి. బాహుబలి రెండు భాగాల్లో మాహిష్మతి సామ్రాజ్యంలోని ఆత్మీయతలు, అనురాగాలు, పోరాటాలు, ప్రేమలు, కుట్రలు, కుతంత్రాలను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అద్భుతంగా కళ్లకు కట్టారు. నిజంగా మాహిష్మతి రాజ్యం ఉండేదని ప్రతి ఒక్కరూ భావించేలా చేశారు. ఆ రాజ్యానికి అందరూ కనెక్ట్ అయ్యారు.
బాహుబలి, భల్లాల దేవాల గురించి అంతా చూపించారు. అయితే వారిద్దరి తల్లిగా శివగామి గురించి తక్కువగానే చూపించారు. ఆ లోటు తీర్చడానికే ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ వారు ఈ ప్రయత్నం చేస్తున్నారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడడంలో ‘శివగామి’ ఎంతగా కష్టపడిందో .. కుమారులను రక్షించుకోవడానికి ఎంతగా శ్రమించిందో.. ఆ విషయాలు ఈ సిరీస్ లో ఉండనున్నాయి. మూడు సీజన్లుగా రానున్న ఈ సిరీస్ కోసం 375 కోట్లను కేటాయించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ కి దేవ్ కట్టా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. రాజమౌళి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని సమాచారం. ఈ విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.