మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించగా.. జయం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “గాడ్ ఫాదర్”. మలయాళ చిత్రం “లూసిఫర్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ కు కూడా పెద్దగా అంచనాలు లేవు. అందుకు కారణం సినిమా ప్రమోషన్స్. సినిమా ఇవాళ విడుదల అనగా.. నిన్న సాయంత్రం లిరికల్ వీడియోలు రిలీజ్ చేసుకుంటూ కూర్చున్నారు చిత్రబృందం. ఇక చిరంజీవి లాంటి హీరో సినిమాను చెన్నై మరియు తమిళనాడులోని పలు ఏరియాల్లో విడుదల చేయలేకపోవడం.. సూపర్ గుడ్ మూవీస్ & కొణిదెల ప్రొడక్షన్స్ ఘోర వైఫల్యం. మరి ఇంత బేసిక్ ప్రమోషన్స్ తో విడుదలైన “గాడ్ ఫాదర్” ఎలా ఉందో చూద్దాం..!!
కథ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి (సర్వదమన్) గుండెపోటుతో అర్ధాంతరంగా మృతి చెందుతారు. ఆయన ఆకస్మిక మృతితో.. జన జాగృతి పార్టీలో రాజకీయ చీలిక ఏర్పడుతుంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై రాష్ట్రమంతా అయోమయం నెలకొని ఉంటుంది. ఈ సందర్భాన్ని వినియోగించుకొని.. ముఖ్యమంత్రి కుమార్తె సత్యప్రియ (నయనతార) భర్త జయదేవ్ (సత్యదేవ్) సి.ఎం అవ్వాలనుకుంటాడు.
ఈ రాజకీయ చదరంగాన్ని చక్కదిద్దడానికి రంగంలోకి దిగుతాడు కింగ్ మేకర్ బ్రహ్మ (చిరంజీవి). బ్రహ్మ ఎంట్రీతో అప్పటివరకూ ఉన్న సందిగ్ధత తొలగి.. కమ్ముకున్న మేఘాలు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ ఉంటాయి. అసలు బ్రహ్మ ఎవరు? జన జాగృతి పార్టీ భవిష్యత్ ను నిర్ణయించగల శక్తిగా ఎలా ఎదిగాడు? అతడి నేపధ్యం ఏమిటి? జయదేవ్ ను ఎలా ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “గాడ్ ఫాదర్”.
నటీనటుల పనితీరు: చిరంజీవి ఎంత గొప్ప నటుడు అనే విషయాన్ని కొత్తగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన గత సినిమాలు నటుడిగా ఆయన స్థాయిని కాస్త తగ్గించాయి అనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి. అయితే.. మళ్ళీ గాడ్ ఫాదర్ లో పాత మెగాస్టార్ కనిపించాడు. ఆయన కళ్లను దర్శకులు పూర్తిగా వాడుకొని ఏళ్ళవుతోంది. మోహన్ రాజా ఆ తప్పు చేయలేదు. నటుడిగా చిరంజీవి, ఆయన కళ్లను పూర్తిగా వాడుకున్నాడు. వెండి తెర నిండుగా నిప్పులు కక్కే మెగాస్టార్ కళ్ళు చూస్తేనే పైసా వసూల్ ఫీల్ కలుగుతుంది. ఆ కళ్ల షాట్స్ కోసం ఇంకోసారి సినిమా చూడొచ్చు. ఇక బ్రహ్మగా చిరంజీవి తన అభిమానులను మాత్రమే కాదు..
మోహన్ లాల్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేసిన యాంటీ ఫ్యాన్స్ ను సైతం సంతుష్టులను చేశాడు. 68 ఏళ్ల వయసులో చిరంజీవి చేసిన ఫైట్స్ కంపోజిషన్ కాస్త అతి అనిపించినా.. మాస్ ఆడియన్స్ కు ఎక్కేస్తుంది. చిరంజీవి ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు.. ఆయన ముందు నటుడిగా నిలదొక్కుకోవడం అనేది బడా బడా స్టార్ల వల్లే కాలేదు. అలాంటిది ఈ చిత్రంలో సత్యదేవ్.. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిని కూడా డామినేట్ చేసే స్థాయిలో నటించడం అనేది మామూలు విషయం కాదు. జైల్ సీన్ లో చిరంజీవి డామినేషన్ ఎలివేట్ అయ్యింది అంటే అందుకు ముమ్మాటికీ కారణం సత్యదేవ్ నటన. అతడి వాయిస్ అతడికి నటుడిగా పెద్ద ఎస్సెట్. సత్యదేవ్ కెరీర్లో ఓ కలికితురాయిగా జయదేవ్ పాత్ర మిగిలిపోతుంది.
సల్మాన్ ఖాన్ పాత్ర, అతని ఎలివేషన్ షాట్స్ మాత్రం సినిమాకి అవసరమా అన్నట్లు అనిపించాయి. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ & చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ బాగున్నా.. ఆ ఎలివేషన్స్ కాస్త డీసెంట్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది.చిరంజీవి చెల్లెలిగా నయనతార, పోలీస్ ఆఫీసర్ గా సముద్రఖని, సహాయ పాత్రల్లో మురళీశర్మ, సునీల్, షఫీ, గెటప్ శ్రీనులు ఆకట్టుకున్నారు. “సిరివెన్నెల” ఫేమ్ సర్వదమన్ ను చాన్నాళ్ల తర్వాత ఓ ముఖ్యపాత్రలో చూడడం సంతోషపరిచిన విషయం. సినిమా క్యాస్టింగ్ విషయంలో చిత్రబృందం తీసుకున్న స్పెషల్ కేర్ ను మెచ్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ కరెక్ట్ గా సరిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: తెలుగులో దర్శకులెవరూ లేనట్లు.. తమిళ దర్శకుడు జయం మోహన్ రాజాకు “గాడ్ ఫాదర్” దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం పట్ల చాలా నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉన్నట్లుండి విడుదల చేసిన టీజర్ కట్ & క్వాలిటీ చూసి “ఇదేంటి లూసిఫర్ స్పూఫా?!” అనే కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా ఆశించిన స్థాయి హైప్ అయితే తీసుకురాలేకపోయాయి. దాంతో జయం మోహన్ రాజాను దర్శకుడిగా పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశారు అనే స్టేట్మెంట్స్ కూడా వెలువడ్డాయి.
సదరు స్టేట్మెంట్స్ కు సినిమాతో సమాధానం చెప్పాడు మోహన్ రాజా. చిరంజీవిలోని నటుడ్ని, చిరంజీవి చరిష్మాను అత్యద్భుతంగా యూటిలైజ్ చేసుకోవడమే కాక.. “లూసిఫర్” కథను “బ్రహ్మ” క్యారెక్టర్ ఎలివేషన్ కు మాత్రమే వినియోగించుకొని.. కథలో చేసిన మార్పులు, చిరంజీవికి ఇచ్చిన ఎలివేషన్స్ కి థియేటర్లలో అభిమానులు చొక్కాలు చించుకొనేలా చేశాడు. దర్శకుడిగా, కథకుడిగా మోహన్ రాజా 100% విజయం సాధించాడు. చిరంజీవి ఇమ్మీడియట్ గా మోహన్ రాజాకు మరో అవకాశం ఇచ్చిన తప్పులేదు. ఆ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు మోహన్ రాజా.
ఇక పాటలతో నిరాశపరిచిన తమన్.. నేపధ్య సంగీతం విషయంలో దుమ్ము లేపాడు. చిరు ఎలివేషన్స్ కు, ఫైట్స్ కు, ముఖ్యంగా జైల్ ఫైట్ & చిరు వెర్సెస్ సత్యదేవ్ సీన్స్ కి తమన్ బీజీయమ్ కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. టీజర్ చూసి.. “నిరవ్ షా లాంటి సీనియర్ కెమెరామెన్ తీసిన సినిమానా ఇది?” అని బాధపడ్డవారిలో నేను ఒకడ్ని. కానీ.. సినిమా చూశాక నిరవ్ షా గొప్పదనం మరోసారి అర్ధమవుతుంది. చిరంజీవి కళ్ళకు పెట్టిన క్లోజప్ షాట్స్ అన్నీ కలిపి ఒక మినీ మూవీలా రిలీజ్ చేసినా సూపర్ హిట్ అయిపోతుంది.
అంత బాగున్నాయి ఆయన పెట్టిన ఫ్రేమ్స్ & స్లో మోషన్ షాట్స్. సినిమాకి ఆయన పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, డి.ఐ వంటి డిపార్ట్మెంట్స్ అన్నీ తమ బెస్ట్ ఇచ్చాయి. వీళ్ళందరికంటే కాస్త ఎక్కువ మార్కులు సంపాదించుకున్న వ్యక్తి లక్ష్మీ భూపాల్. అతడి డైలాగులు తూటాల్లా కాదు.. ఏకంగా మిస్సైల్స్ లా థియేటర్లలో విస్పోటాన్ని సృష్టించాయి. ఈ సినిమా తర్వాత లక్ష్మీభూపాల్ మోస్ట్ బిజీయస్ట్ డైలాగ్ రైటర్ అయిపోతాడు.
విశ్లేషణ: చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకుమించిన తరహాలో చూపించిన చిత్రం “గాడ్ ఫాదర్”. చిరంజీవి నటన, ఆయన కళ్ళు, సత్యదేవ్ నట విశ్వరూపం, తమన్ సంగీతం, నిరవ్ షా కెమెరా వర్క్, మోహన్ రాజా టేకింగ్ కోసం థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం “గాడ్ ఫాదర్”. 89 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ కలెక్షన్ “గాడ్ ఫాదర్”కు చాలా ఈజీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
చిరంజీవి కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచే అన్నీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ చిత్రానికి. దసరాకి మెగాస్టార్ విజయాన్ని అందుకోవడమే కాక.. “ఆచార్య”తో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన ఆయన అభిమానుల్ని కాలరేట్టుకొనేలా చేశాడు.
రేటింగ్: 3.5/5