ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా చిత్రం “గౌండ్ జీరో” (Ground Zero). బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆడియన్స్ అలరించగా.. ఇటీవల పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి కారణంగా ఈ సినిమా ఇంకాస్త ప్రత్యేకతను సంతరించుకుంది. నరేంద్రనాథ్ ధార్ దూబే అనే బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: 2001లో జమ్మూలో చోటు చేసుకున్న పిస్టల్ గ్యాంగ్ అరాచకాలతో కథ మొదలవుతుంది. భారత జవాన్ల వరుస హత్యల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఘాజీ బాబాను పట్టుకోవడం కోసం బీఎస్ఎఫ్ చీఫ్ నరేంద్రనాథ్ దూబే (ఇమ్రాన్ హష్మీ) రంగంలోకి దిగుతాడు.
అయితే.. ఆ క్రమంలో దొరికిన లీడ్స్ ను పట్టుకుంటూ వెళ్లిన ఇమ్రాన్ ఓ చట్రంలో చిక్కుకుంటాడు. అదే సమయంలో పార్లమెంట్ దాడి, జమ్మూలో ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ మీద దాడి వంటి అరాచకాల్లో ఘాజీ బాబా హస్తం ఉందని తెలుసుకుంటాడు.
అటువంటి డేంజరస్ టెర్రరిస్ట్ ఘాజీ బాబాను, నరేంద్రనాథ్ ఎలా పట్టుకోగలిగాడు? అనేది “గ్రౌండ్ జీరో” కథాంశం.
నటీనటుల పనితీరు: ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. దేశభక్తి మెండుగా ఉన్న జవాన్ గా, ప్రజలను రక్షించడం కోసం పాటు పడే అధికారిగా, తన పిల్లలకు తుపాకీ రక్షణ అవసరం లేని చదువు ఇవ్వడం కోసం ఆరాటపడే తండ్రిగా అద్భుతంగా నటించాడు ఇమ్రాన్ హష్మీ. ముఖ్యంగా.. ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించాడు.
సైనికుడి భార్యగా సాయి తమాంకర్ బాధ్యతగల పాత్ర పోషించింది. ఆమె నటనలో బాధ, ఉద్యోగం కనిపిస్తాయి.
కీలకమైన పాత్రలో జోయా హుస్సేన్ నటన సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.
లలిత్ ప్రభాకర్, రాహుల్, మీర్ మెహ్రోజ్, ముఖేష్ తివారి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: కమల్ జీత్ నేగి సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. జమ్మూ పరిసరాలను, బీఎస్ఎఫ్ ఫంక్షనాలిటీస్ ని కవర్ చేసిన విధానం కానీ ఆడియన్స్ ను రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. అలాగే క్లైమాక్స్ ను డీల్ చేసిన తీరు కూడా బాగుంది.
ఆర్ట్ & ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తమ బెస్ట్ ఇచ్చారు. సీజీ వర్క్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది, అందువల్ల బ్లాస్టింగ్ సీన్స్ చాలా సహజంగా ఉన్నాయి. అలాగే.. గన్స్ & బుల్లెట్ సౌండింగ్ విషయంలో సౌండ్ డిజైనర్ తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాలి.
దర్శకుడు తేజస్ ప్రభ విజయ్ బయోపిక్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. నిజమైన సంఘటనలను ఎక్కడా ఓవర్ గా డ్రమటైజ్ చేయకుండా, కథా గమనం కోసం వాటిని వినియోగించుకున్న విధానం ప్రశంసనీయం. అలాగే.. ఇమ్రామ్ హష్మీలోని నటుడ్ని సరికొత్తగా చూపించే ప్రయత్నం ఫలించింది. మిలటరీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ను చాలా సిన్సియర్ గా పిక్చరైజ్ చేసిన విధానం, అన్నిటికీ మించి క్లైమాక్స్ ను రియలిస్టిక్ గా డీల్ చేసిన తీరు ప్రేక్షకులకు ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. కథకుడిగా, దర్శకుడిగా తేజస్ ప్రభ విజయ్ డియోస్కర్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు.
విశ్లేషణ: దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమాల్లో సినిమాటిక్ లిబర్టీస్ కాస్త ఎక్కువగా తీసుకుంటారు. అందువల్ల సినిమాగా బాగున్నా, ఎందుకో ఎమోషనల్ గా మాత్రం కనెక్ట్ అవ్వలేం. అయితే.. “గ్రౌండ్ జీరో” విషయంలో అలాంటి తప్పులేమీ దొర్లకుండా చాలా అథెంటిక్ గా ఉంచేందుకు దర్శక బృందం తీసుకున్న శ్రద్ధ సినిమాకి బాగా పనికొచ్చింది. ఇమ్రాన్ హష్మీ నటన, సినిమాలోని యాక్షన్ బ్లాక్ ను డిజైన్ చేసిన విధానం, ఎమోషనల్ కనెక్టివిటీ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.
ఫోకస్ పాయింట్: ఇంటెన్స్ & ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్!
రేటింగ్: 3/5