తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన “మెర్సల్” తమిళ మూవీ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రశ్నిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సమస్యలను ఎత్తిచూపుతూ వచ్చిన ఈ మూవీ అదరగట్టే కలక్షన్స్ రాబట్టింది. అందుకే దీనిని తెలుగులోనూ డబ్ చేశారు. “అదిరింది” అనే టైటిల్ తో ఎప్పుడో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని అడ్డంకుల వల్ల పోస్ట్ పోన్ అవుతూ నవంబర్ 9న థియేటర్లోకి వచ్చింది. ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే తమిళనాడు థియేటర్లలో విజిల్స్ వేయించిన డైలాగులు తెలుగులో లేవు. “ఇండియాలో డిజిటల్ మనీ అన్నారు. ఎవడి దగ్గర డబ్బుల్లేవ్….” తర్వాత డైలాగ్‌ని మ్యూట్ చేశారు.
“మెడిసిన్ మీద 12శాతం జీఎస్టీ కడుతున్నాం..లిక్కర్ మీద మాత్రం జీఎస్టీ లేనేలేదు.. ఎందుకిలా?”.. సింగపూర్ ప్రజలు 7శాతం జీఎస్టీ కడుతున్నారు.. ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు.. కాని భారత ప్రభుత్వం ప్రజలనుంచి 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. అయినా ఎందుకని కనీసం ఉచిత వైద్యం అందించలేకపోతోంది?” అని హీరో జీఎస్టీ గురించి చెప్పే డైలాగ్స్ అన్నింటినీ మ్యూట్ చేశారు. దీంతో తమిళ్‌లో వివాదమైన ఈ డైలాగ్‌లను తెలుసుకోవాలని వెళ్లిన వారు ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వస్తున్నారు. ఆ డైలాగులన్నీ మ్యూట్ చేస్తే ఇంకేం అదురుతుంది? .. అంటూ పెదవి విరుస్తున్నారు.