కడవరకూ ప్రజాక్షేమాన్ని కోరుకున్న నిజమైన నాయకుడు

నిజమైన నాయకుడు అంటే పదవీకాంక్ష లేని వాడు, నిజమైన నాయకుడు అంటే నాయకత్వం పట్ల వ్యామోహం లేని వాడు, నిజమైన నాయకుడు అంటే ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించేవాడు. ఈ మూడు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే నందమూరి హరికృష్ణ నిజమైన నాయకుడిగా నిలిచాడు. ఎటువంటి భేషజాలు లేని ఈ మంచి మనిషి ఇవాళ ఉదయం కారు ప్రమాదంలో కన్ను మూసిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో ఆయన పూట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భాన్ని పురస్కరించుకొని హరికృష్ణ తన అభిమానులకు ఒక లేఖ వ్రాశారు.. బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో అదే ఆయన లేఖ అవుతుంది అని.

“సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ” అని వ్యాయబడిన హరికృష్ణ ఆఖరి లేఖ చదువుతున్నవారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus