అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అభయ్ రామ్ తనతో బాక్సింగ్ ఆడుతున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సంబరపడేలోపే జూనియర్ ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని ఒక ప్రమాదం కన్నీటిపర్యంతం అయ్యేలా చేసింది. ఆయన తండ్రి హరికృష్ణకు ఇవాళ ఉదయం నల్గొండ జిల్లా సమీపంలో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణ తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ.. ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. జూనియర్ ఎన్ టి ఆర్ అన్నయ్య జానకిరామ్ కూడా ఇదే విధంగా రోడ్ యాక్సిడెంట్ లో మృతిచెంది ఉండడం గమనార్హం. తన ప్రతి ఆడియో ఈవెంట్ లేదా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చే అభిమానుల్ని మాత్రమే కాదు తన సినిమా చూసేందుకు థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకి కూడా ఎంతో ఆప్యాయంగా “జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.. మీకోసం మీ కుటుంబం వేచి చూస్తుంటుంది” అని చెప్పే ఎన్.టి.ఆర్ కుటుంబం మళ్లీ ఇలా ఒక యాక్సిడెంట్ బారిన పడి బాధపడుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
నటుడిగా, రాజకీయ నాయకుడిగా హరికృష్ణ తనదైన పంథాలో రెండింటికీ న్యాయం చేసారు. తెలుగు భాష, చరిత్ర మీద ఆయనకి ఉన్న పట్టు ఎందరికో ఆశ్చర్యాన్ని కలిగించేది. అటువంటి వ్యక్తి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం నందమూరి కుటుంబానికి తీరనిలోటు. అన్నదమ్ములు ఎన్.టి.ఆర్-కళ్యాణ్ రామ్ ల బాధను వర్ణించడం వారిని కన్నీటిని తుడవడం వారి తల్లులకు సైతం సాధ్యం కాదు, ఎందుకంటే ఇద్దరూ కూడా హరికృష్ణను తండ్రిలా కాక దేవుడిలా భావిస్తారు, ఆరాధిస్తారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధ నుంచి బయటపడే మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని వేడుకోవడం తప్ప ఏం చేయగలం.