కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇంకా చెప్పాలంటే ఈయన మ్యూజిక్ లేకుండా మనకి టైం పాస్ అవ్వదు. ఈ మాటకు అందరూ ఏకీభవిస్తారు. ఎవరు లాంగ్ జర్నీ చేయాలన్నా హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన ‘ఆరెంజ్’ ‘రంగం’ వంటి సినిమా పాటలు కావాల్సిందే. అంతే కాదు ‘గజినీ’ ‘ఘర్షణ’ ‘వాసు’ ‘స్పైడర్’ ‘మున్నా’ వంటి సినిమాలకు కూడా హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు.
సినిమాలకి ఆయన సూపర్ మ్యూజిక్ అందించారు.కాకపోతే ఈయన స్ట్రైట్ తెలుగు సినిమాలకి పనిచేసి సూపర్ హిట్ మ్యూజిక్ ను అందించినా.. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. హారిస్ జయరాజ్ విషయంలో ఇదొక బ్యాడ్ సెంటిమెంట్ అని చెప్పాలి. అయినప్పటికీ అప్పట్లో హారిస్ జయరాజ్ మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఒక్కో సినిమాకు ఆయన రూ.1 .5 కోట్ల వరకు పారితోషికం అందుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
హారిస్ జయరాజ్(Harris Jayaraj) చేతిలో ఇప్పుడు ఎక్కువ ఆఫర్లు లేవు. ఈయన సంగీతంలో రూపొందిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు. అందుకే హారిస్ జయరాజ్ చేతిలో ఇప్పుడు ఎక్కువ ప్రాజెక్టులు లేవు. మరోపక్క టాలీవుడ్లో తమన్, దేవి శ్రీ ప్రసాద్ తప్ప క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్లు లేనట్టే ఇక్కడి మేకర్స్ భావిస్తున్నారు. అందుకే తమిళ్ లో ఖాళీగా ఉన్న హారిస్ జయరాజ్ ను టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు.
నితిన్ – వక్కంతం వంశీ ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎక్స్ట్రా’ సినిమాకి హారిస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన రూ.60 లక్షలు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఆయన డిమాండ్ సగానికి సగం పడిపోయినట్టే. దీంతో పాటు నాగ శౌర్య నటిస్తున్న సినిమాకి కూడా హారిస్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఆ సినిమాకు కూడా ఈయన రూ.60 లక్షల రేంజ్లోనే పారితోషికం అందుకున్నట్టు వినికిడి.