ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మున్నీ అంటూ పాన్ ఇండియా (బాలీవుడ్) ప్రేక్షకులకు పరిచయమైన హర్షాలీ మల్హోత్రా.. ఇప్పుడు జననిగా మరోసారి పాన్ ఇండియా (ఈసారి సౌత్ నుండి) ఫ్యాన్స్‌ని కలవనుంది. ‘అఖండ 2: తాండవం’ సినిమాతో హర్షాలీ మెయిన్ ఆర్టిస్ట్‌గా పరిచయం కాబోతోంది. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈసినిమాలో జనని అనే పాత్రలో హర్షాలీ నటిస్తోంది అని కొన్ని నెలల క్రితమే అనౌన్స్ చేశారు.
అయితే, ఇప్పుడు సినిమా విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్లు కూడా చేసింది. ‘బజరంగీ భాయిజాన్’ సినిమా తర్వాత నటనకు విరామం ఇచ్చి చదువుపైనే దృష్టి పెట్టానని చెప్పిన హర్షాలీ ఈ మధ్యలో కథక్ నేర్చుకున్నానని చెప్పింది. టీనేజీలోకి వచ్చాక మంచి పాత్ర కోసం ఎదురుచూస్తుండగా ‘అఖండ 2: తాండవం’ సినిమా అవకాశం వచ్చింది అని చెప్పింది.

తెలుగు సినిమా నటుల్లో బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రభాస్ ఫేవరెట్ అని చెప్పేసింది. ‘బజరంగీ భాయిజాన్’ సినిమా షూటింగ్ సమయంలో సంబంధించి సల్మాన్ ఖాన్‌తో మంచి జ్ఞాపకాలున్నాయని చెప్పింది. ఆ సినిమా టైమ్‌లో మేం టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లమని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంది. ఇక బాలకృష్ణ అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో శక్తి కోసం అల్లం కషాయం తాగమని చెబుతుండేవారని, కానీ, తనకేమో అల్లం అంటే ఇష్టం ఉండదని నవ్వేసింది.
ఇక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలన్నది తన డ్రీమ్ అని అని చెప్పుకొచ్చింది హర్షాలీ. ఆయన హీరోయిన్స్‌ని చూపించే విధానమంటే తనకు ఇష్టమని చెప్పింది. ఇక నటిగా ఒకే జానర్‌కు పరిమితం కాకుండా అన్నింటినీ టచ్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పింది. మరి ఇప్పుడు హర్షాలీ మాట విని నెక్స్ట్ ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి. చూద్దాం అభిమాన హీరోలు ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో. లేక భన్సాలీనే ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.
