థియేటర్లు తెరుచుకుని పరిస్థితి అంతా సెట్ అయినప్పటికీ.. పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ఓటిటిలోనే నేరుగా విడుదల అవుతున్నాయి. అలా అని అవి కంటెంట్ లేని సినిమాలు అనుకుంటే పొరపాటే. అందులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఉంటున్నాయి. ఇవి చూసిన వాళ్ళకి .. థియేటర్లలో చూసే పెద్ద సినిమాలు కూడా నచ్చడం లేదు అంటే అవి ఎంత డామినేట్ చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి కోవలోకే వస్తుంది తాజాగా జీ5 ఓటిటిలో విడుదలైన ‘హెడ్స్ అండ్ టైల్స్’ చిత్రం. సునీల్ చిన్న పాత్రలో కనిపించిన ఈ చిత్రం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : అలివేలు మంగ (దివ్య శ్రీపాద) ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆమె భర్త ఓ బార్‌లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ అతను అద్దం పగలగొట్టిన కారణంగా రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఓనర్లు ఒత్తిడి పెడుతుంటారు. ఈ కారణంగా తన మెడలో ఉన్న బంగారం ఇవ్వమని మంగని ఇబ్బంది పెడుతుంటాడు ఆమె భర్త. అనంతరం స్టేషన్ కు వెళ్ళిన మంగ… అనీషా (శ్రీవిద్య మహర్షి) అనే అమ్మాయిని కలుస్తుంది.
ఆమెకి ఓ వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రని పోషించే అవకాశం లభిస్తుంది. అయితే ఆమెకి కాబోయే భర్తకి అది నచ్చదు. కాదని ఆ పాత్రలో నటిస్తే యాసిడ్ పోసేస్తాను అంటూ అనీషాని బెదిరిస్తాడు. అందుకే ఆమె కంప్లయింట్ ఇవ్వడానికి స్టేషన్‌కు వెళ్తుంది. అటు తర్వాత శృతి (చాందిని రావు) పాత్ర కూడా ఎంట్రీ ఇస్తుంది.ఈమె పాత్రకి వాళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ కి సంబంధం ఏంటి? చివరికి వీళ్ళ సమస్యలు ఎలా తీరతాయి అనేది కచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు : దివ్య శ్రీపాద ఇది వరకు చాలా సినిమాల్లో నటించింది కానీ.. ఈ సినిమాలో ఆమె పోషించిన కానిస్టేబుల్ పాత్ర బాగుందనే చెప్పాలి.ఇక అనీషా పాత్రలో నటించిన శ్రీవిద్య మహర్షి బాగా నటించింది.కొంతమంది అబ్బాయిలకి ఈమెను కొట్టాలనే కోపం కూడా వస్తుంది. ఎందుకంటే అంత నేచురల్ గా పెర్ఫార్మ్ చేసింది. ఈమె పాత్రకి మంచి డైలాగులు కూడా రాసాడు దర్శకుడు.
చాందిని రావు నటన కూడా పర్వాలేదు అనిపించింది కానీ ముందు చెప్పుకున్న ఇద్దరమ్మాయిల అంత కాదు. సినిమా మధ్యలో సుహాస్, సునీల్ లు కాసేపు కనిపించి సందడి చేశారు. ఇక ముగ్గురు అమ్మాయిలకి జంటలుగా కనిపించిన అబ్బాయిల పాత్రలు పెద్దగా గుర్తుండవు కానీ వాళ్ళ వరకు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : సందీప్ రాజ్ అందించిన కథ… దానిని దర్శకుడు సాయికృష్ణ ఎన్ రెడ్డి మలిచిన తీరు బాగానే ఉంది కానీ.. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్లకి ఎక్కువ సమయం తీసుకున్న ఫీలింగ్ కలిగిస్తుంది.అలా అని ఎక్కువ నిడివి పెంచేయలేదు…
అలాగే ఫైనల్ గా ఇచ్చిన కన్క్లూజన్ బాగుంది.డైలాగులు కూడా ఇంకోసారి వినాలనిపించేలానే ఉన్నాయి.ఇక మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది.వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ క్వాలిటీగానే ఉంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టుగానే ఉన్నాయి.
విశ్లేషణ : సునీల్, సుహాస్ వంటి వారి పాత్రలు ఎక్కువ సేపు ఉంటాయని ఆశించిన వారికి కొంత నిరాశ ఎదురవుతుందేమో కానీ.. వీకెండ్ కు మాత్రం హ్యాపీగా ఓ సారి ఇంట్లో కూర్చొని చూడదగ్గ సినిమానే..!