తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. అసలు ఆ కేసుతో ఆర్యకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. కావాలనే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆర్యపై ఆరోపణలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయం చేశాయని అన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి డెబ్భై లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చెన్నైలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. అన్ని ప్రశ్నలకు ఆర్య ఓపికగా సమాధానాలు చెప్పారు.
విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలు విషయాలై బయటపడ్డాయి. చెన్నైలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేశారు. దాని ద్వారా శ్రీలంక యువతితో చాటి చేసి డబ్బులు దండుకున్నారు. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు ఆర్య.