తమిళ నటుడు సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం (సెప్టెంబర్ 28) తన లేటెస్ట్ మూవీ సిత్తా కోసం బెంగళూరులో ప్రమోషన్లు నిర్వహించాడు. అతడు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి కావేరీ నదీ జలాలపై కర్ణాటకకు అనుకూలంగా ఆందోళన నిర్వహిస్తున్న నిరసనకారులు వచ్చారు. సిద్ధార్థ్ మాట్లాడుతుంటే వాళ్లు అడ్డుపడ్డారు. ఓవైపు కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల సమస్య ఉన్న సమయంలో ఈ ప్రెస్ మీట్ అనవసరం అని వాళ్లు వాదించారు.
వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని (Siddharth) సిద్ధార్థ్ ను డిమాండ్ చేశారు. వాళ్లు అలా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా అతడు మాత్రం కాసేపు అలాగే కూర్చున్నాడు. మధ్యలో సిద్ధార్థ్ కూడా కన్నడలోనే నిరసనకారులను ఉద్దేశించి ఓ ప్రకటన కూడా చేశాడు. అయినా వాళ్లు శాంతించలేదు. అలాగే నిరసన తెలిపారు. సిద్ధార్థ్ వెనుక ఉన్న పోస్టర్లను తీసేసి అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక అతడు లేచి నిల్చొని మీడియాకు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది అభిమానులు సిద్ధార్థ్ కు మద్దతుగా కామెంట్స్ చేశారు. ఆందోళనకారుల పిరికి చర్య ఇది అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ ఘటనపై సిద్ధార్థ్ ఏమీ స్పందించలేదు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే కరువు కోరల్లో చిక్కుకోగా.. కావేరీ నుంచి తమిళనాడుకు నీళ్లు వదలాల్సిందేనన్న కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు పెట్టాయి. దీంతో కర్ణాటకలోని మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.