ఈరోజుతో అంటే అక్టోబర్ 10 తో ‘నువ్వే నువ్వే’ చిత్రం రిలీజ్ అయ్యి.. 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది.అంతేకాదు ‘నువ్వే నువ్వే’ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా దర్శకుడిగా మారి 20 ఏళ్ళు పూర్తయినట్టే..! త్రివిక్రమ్ ఈరోజు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రాజమౌళి సినిమాల తర్వాత ఇండస్ట్రీ హిట్లు కొట్టగల కెపాసిటీ త్రివిక్రమ్ సినిమాలకు మాత్రమే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ‘నువ్వే నువ్వే’ చిత్రాన్ని ‘స్రవంతి మూవీస్’ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు.
తరుణ్, శ్రియ జంటగా నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ షోకి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ పై హీరో తరుణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తరుణ్ మాట్లాడుతూ.. “సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా… ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో ఈ సినిమా చూస్తా. నన్ను ‘నువ్వే కావాలి’తో రామోజీరావు గారు, ‘స్రవంతి’ రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను?’ వంటి సినిమాలు చేశా. ఈ సంస్థలో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. హీరోగా నా తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ మాటలు రాశారు.
దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎంత మంది హీరోలతో చేసినా… ఆయన ఫస్ట్ హీరో నేనే. ప్రకాష్ రాజ్ గారితో కలిసి ఈ సినిమాలో తొలి సారి చేశా. ఆయన, శ్రియ, ఇతర నటీనటులు అందరితో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమా ఇంకొకటి చేయమని చాలా మంది అడుగుతారు. నాకు ఇటువంటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే…. ఎప్పటికీ బోర్ కొట్టవు” అంటూ చెప్పుకొచ్చాడు.