థళపతి విజయ్ ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న లగ్జరీ కారుకు తమిళనాడు ఎంట్రీ పన్ను వ్యవహారంలో లక్ష రూపాయాల జరిమానాతోపాటు న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనకు విధించిన జరిమానా, వ్యాఖ్యల విషయంలో విజయ్ అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణ్యం ఇచ్చిన తీర్పు నకలు లేని కారణంగా విజయ్ దానిని అప్పీల్ పిటిషన్‌ను విచారణ జాబితాలో పొందుపరచలేదు. దీంతో తీర్పు నకలు లేకుండా పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని విజయ్ తరఫున విజ్ఞప్తి పత్రం దాఖలు చేశారు.
దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయమూర్తులు… విజయ్ అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ దురైస్వామి, జస్టిస్ హేమలత ద్విసభ్య ధర్మాసనానికి విచారణకు సిఫార్సు చేశారు. ఈ కేసు విచారణ ఈ నెల 26న జరుగనున్నట్లు సమాచారం. దీంతో ఆ రోజు కేసు విషయంలో కొలిక్కి వస్తుందేమో చూడాలి. విజయ్ ఇంగ్లాండ్ నుండి ₹7.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును తెప్పించుకున్నారు. దానికి పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణియన్ కొట్టివేసిన విషయం తెలిసింఏద. లక్ష రూపాయల జరిమానాను రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి కొవిడ్ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించారు. సినిమాల్లో అవినీతి వ్యతిరేక పాత్రల్లో నటిస్తున్న హీరోలు పన్నులు కట్టడంలో విఫలమవుతున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.