నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన మలయాళ చిత్రం “హేయ్ సినామిక”. దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరీ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో అనువాద రూపంలో విడుదలైంది. న్యూ ఏజ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నవతరం ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిందా లేదా అనేది చూద్దాం..!!
కథ: ఆర్యన్ (దుల్కర్ సల్మాన్) భార్యా విధేయుడు, ప్రేమించి పెళ్లాడిన మౌన (అదితిరావు హైదరీ)ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంటాడు. ఎవరు చూసినా కుళ్లుకునే అద్భుతమైన జంట వీరిది. కానీ.. ఆర్యన్ అతి ప్రేమ వల్ల మౌన చాలా ఇబ్బంది పడుతుంది. ఎలాగైనా ఆర్యన్ అతి ప్రేమ నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సైకాలజిస్ట్ మలర్ (కాజల్)తో ఆమె భర్తను ప్రేమలో పడేసేలా చేసి.. అతడి నుండి విడిపోవాలని ఒక డ్రామా ప్లాన్ చేస్తుంది. మౌన వేసిన ప్లాన్ ఎంతవరకూ వర్కవుటయ్యింది? ఆర్యన్-మౌన-మలర్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎన్ని ఇబ్బందులకు దారి తీసింది? అనేది “హేయ్ సినామిక” కథాంశం.
నటీనటుల పనితీరు: దుల్కర్, అదితిరావు హైదరీ, కాజల్, శ్యామ్ ప్రసాద్ ఇలా అందరు నటీనటులూ తమ బెస్ట్ ఇచ్చారు. అయితే.. ఏ ఒక్కరి క్యారెక్టర్ కు సరైన జస్టిఫికేషన్ ఉండకపోవడం వల్ల వాళ్లందరి నటన, స్క్రీన్ ప్రెజన్స్ & కృషి బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకురాలు బృంద సన్నివేశాలను కంపోజ్ చేసుకున్న విధానం బాగున్నప్పటికీ.. ఆ సన్నివేశాలను అల్లిన విధానం కానీ, సందర్భం కానీ అస్సలు బాలేదు. కొరియోగ్రాఫర్ కాబట్టి సీన్స్ వరకూ బాగానే ప్లాన్ చేసుకున్న బృంద, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కనీస జాగ్రత్త చూపించలేదు. ఇక మూల కథను కొరియన్ సినిమా “ఆల్ ఎబౌట్ మై వైఫ్ (2012)” నుండి స్ఫూర్తి పొందినప్పటికీ..
ఆ కథను రీజనల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా మార్చడంలో మాత్రం దారుణంగా విఫలమైంది బృంద. సో, డైరెక్టర్ గా బృంద కనీస స్థాయి మార్కులు కూడా సంపాదించుకోలేకపోయింది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ టీం అందరూ తమ బెస్ట్ ఇచ్చినప్పటికీ.. దర్శకురాలికి సరైన విజన్ లేకపోవడంతో వాళ్లందరి కష్టం వేస్ట్ అయ్యిందనే చెప్పాలి.
విశ్లేషణ: దుల్కర్ కెరీర్లో నటించిన అత్యంత పేలవమైన చిత్రంగా “హేయ్ సినామిక” నిలిచిపోతుంది. టాలెంట్, మనీని దారుణంగా వేస్ట్ చేసిన సినిమా ఇది.
రేటింగ్: 1.5/5