వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ ల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఘటన యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తమ వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా చేయడం కరెక్ట్ కాదంటూ ఈ విషయంలో అమృత కోర్టుకెక్కింది. తన అనుమతి లేకుండా వర్మ సినిమా తీస్తున్నారంటూ ఆరోపించింది.
ముందుగా అమృత నల్గొండ కోర్టుని ఆశ్రయించగా సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టు ఆదేశించింది. దీంతో వర్మ హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ అనంతరం సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని కోర్టు షరతులు విధించింది. దీనికి చిత్రయూనిట్ హామీ ఇవ్వడంతో సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన వర్మ.. ‘మర్డర్’ సినిమా తెరకెక్కడం వెనుక ఉన్న మా మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్ధం చేసుకుందని.. అన్ని విషయాలను కోర్టు ఆర్డర్ వచ్చిందా తరువాత వెల్లడిస్తానంటూ రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. వర్మ మరో వివాదాస్పద కాన్సెప్ట్ తో ‘దిశ ఎన్‌కౌంటర్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తీయడానికి వీల్లేదంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా విషయంలో వర్మ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో చూడాలి!