‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్స్ టైంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ” ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు..! ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా ఇటీవల వచ్చింది. ఇందులో ఒకప్పుడు హిందూ పండిట్లను.. ముస్లింలు ఎలా చంపారో చూపించారు. ఇటీవల ఓ బండిలో గోవులను తీసుకెళ్తుంటే ముస్లిం వ్యక్తిని చితక్కొట్టి.. జై శ్రీరామ్ అన్నారు. మరి ఇదేంటి? అది మత ఘర్షణ అయితే ఇది కూడా మత ఘర్షణే కదా.
మతాలు కాదు మనం మంచిగా ఉండాలి. మనలో మంచి లేకపోతే మతంలో మంచి ఎక్కడ ఉంది. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం కరెక్ట్ గా లేకపోతే ఎక్కడా న్యాయం దొరకదు’ .. అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.ఈమె మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు. కానీ పబ్లిసిటీ కావాల్సిన వాళ్ళు సాయి పల్లవి స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమెను అడ్డుపెట్టుకుని హడావిడి చేశారు. ‘గోరక్షకులు ఆమెకు టెర్రరిస్ట్ లతో సమానమా’ అంటూ చాలా మంది రెచ్చిపోయారు.
ఏకంగా భజరంగ్ దళ్ నాయకులు కూడా వచ్చి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి పై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుని రద్దు చేయాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఆమె అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సాయి పల్లవికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది. ‘విరాట పర్వం’ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఆమె ఆ విషయం పై స్పందించను అంటూ చెప్పి జూన్ 21న హై కోర్టుకెక్కింది.
కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. భజరంగ్ దళ్ నాయకులు సాయి పల్లవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెబితే కేసు వాపసు తీసుకుంటామని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.