‘కార్తికేయ’ సినిమాలు పాము చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తొలి ‘కార్తికేయ’లో పామును హిప్నటైజ్ చేయడం గురించి చెప్పారు. రెండో ‘కార్తికేయ’లో పామును కంట్రోల్ చేయడం గురించి చూపిస్తారు. అసలు నిజంగా పామును కంట్రోల్ చేయొచ్చా. సినిమాలో చూపించినట్లు చేస్తే పాములు మనుషుల కంట్రోల్‌లోకి వస్తాయా? ‘కార్తికేయ 2’ సినిమాలో పాముని పట్టుకునేందుకు హీరో నిఖిల్ ఓ చిన్న టెక్నిక్ చేస్తాడు. పాము ఎదుట చేతిని నేలపై ఆనించి చిటికేస్తాడు. వెంటనే పాము వచ్చి చేతికి చుట్టుకుంటుంది.
ఆ సీన్ చూసి చుట్టుపక్కల వాళ్లు ఇది చూసి ఆశ్చర్యపోతారు, థియేటర్లలో సినిమా చూస్తున్న వాళ్ల పరిస్థితీ దాదాపు అంతే. ‘ఇదెలా సాధ్యం’ అని అడిగితే.. అదే జూలింగ్వలిజం అని వివరణ కూడా ఇస్తాడు. అంతేకాదు ఆ పాముకు సైగ ద్వారా ఏం చెప్పాను అనేది కూడా చెబుతాడు. ‘‘నీకేమీ హాని చేయను అని దానికి అర్థమైన భాషలో చెప్పాను’ అంటాడు. దీంతో జూలింగ్వలిజం అంటే ఏంటి? అనే ప్రశ్న సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే ఇదేం కొత్త కాన్సెప్ట్ కాకపోవచ్చు.
ఇంట్లో పెంపుడు జంతువులకు రోజూ మాటలు, సైగలతో మచ్చిక చేసుకోవడం గురించి మీకు తెలిసే ఉంటుంది. అలా మచ్చిక చేసుకొని, వాటికి అర్థమయ్యేలా చెబితే మన దారికి వచ్చేస్తాయి. అదే జూలింగ్వలిజం. మన ఎమోషన్‌ని అర్థమయ్యేలా జంతువులకు చెప్పటం గొప్ప ఆర్ట్ అంటారు. అయితే ఇదేమంత ఈజీ కాదు. దీని కోసం మొదటగా మన పల్స్ రేట్ మన కంట్రోల్‌లో ఉండాలి.
జంతువులుకు ఏ హానీ చేయమని హామీ ఇచ్చేలా మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. జంతువుల కళ్లలోకి కళ్లు పెట్టి చూడాలి. ఆ చూపుల్లో వాటికి నమ్మకం కనిపించాలి. అప్పుడు అవి మన మాట వింటాయి. మనం చెప్పినట్టు చేస్తాయి. జంతువులు చేసే సౌండ్స్‌నీ మనం గ్రహించాలి. అలాంటి సౌండ్సే చేస్తూ వాటికి దగ్గరవాలి. ‘కార్తికేయ 2’ సినిమాలో పాముని పట్టుకునే సీన్‌లో హీరో చేసింది ఇదే.