ఎవ్వరికీ తెలియని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని పరుచూరి బ్రదర్స్ వెండితెర పై చూపించి అతని త్యాగాన్ని, వీరత్వాన్ని ఇండియా మొత్తం తెలియజేయాలని కంకణం కట్టుకున్నారు. పదేళ్లు ఈ కథని పట్టుకుని ఎంతో మంది హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో మెగాస్టార్ ముందుకొచ్చి చేయడానికి రెడీ అయ్యారు. దానిని ‘సైరా నరసింహారెడ్డి’ గా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. దర్శకుడు సురేంద్ర రెడ్డి ఎ,బి,సి అనే తేడా లేకుండా అందరికీ అర్ధమయ్యే రీతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. ఫలితం ఎలా ఉన్నా ఓ గొప్ప చిత్రం తీశారు అనే ప్రశంసలు అందుకున్నారు.
ఇలాంటి పాత్ర చేసిన మెగాస్టార్ చిరంజీవిని ఎంత పొగిడినా తక్కువే. ఓ పెద్ద స్టార్ అయ్యుండి తన మార్క్ డ్యాన్స్ లు, ఫైట్ లు లేకుండా 60 ఏళ్ళ వయసులో కూడా నిద్రాహారాలు మాని ఈ పాత్రకోసం కష్టపడ్డారు. స్వాతంత్ర్య పోరాటం మొదలు పెట్టడానికి ముందే తెల్ల దొరలకి చమటలు పట్టించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ పరకాయ ప్రవేశం చేసారని చెప్పొచ్చు. తన తండ్రి డ్రీం ప్రాజెక్ట్ ను ఎలాగైనా రూపొందించాలని మంచినీళ్లు లా బడ్జెట్ ను పోసేసాడు మెగాస్టార్ తనయుడు రాంచరణ్. ఎన్ని వివాదాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా సినిమాని విడుదల చేశారు. మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఈరోజు.. ఫిబ్రవరి 21న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి. కానీ ఈయన విషయాన్ని చిత్ర యూనిట్ గుర్తుచేసుకోకపోవడం కాస్త నిరుత్సాహపరిచే విషయం. కనీసం నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పెద్దగా ఈ విషయం పై స్పందించకపోవడం కూడా చింతించాల్సిన విషయమంటూ కొందరు విశ్లేషకులు, పెద్దవాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.