తెలుగువారి సినీ ప్రతిభను ప్రపంచానికి చాటిన చిత్రం బాహుబలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ సినీ అభిమానుల జేజేలు అందుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ ఈ నెల 28 న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలకం కానున్న పాత్రలపై ఫోకస్..
ప్రభాస్ బాహుబలి చిత్రంలో ప్రభాస్ తండ్రి అమరేంద్ర బాహుబలి, కొడుకు మహేంద్ర బాహుబలి(శివుడు) క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు. ఇద్దరి వీరత్వం కొంత మాత్రమే రాజమౌళి మొదటి పార్ట్ లో చూపించారు. బాహుబలి 2 లో భల్లాల దేవుడితో శివుడు ఫైట్.. హైలెట్ కానుంది. మరో పాత్రలోనూ డార్లింగ్ మెరవనున్నారు. అతనే మహిష్మతి రాజ్యాన్ని పాలించిన విక్రమదేవుడు(అమరేంద్ర బాహుబలి తండ్రి). ఇతన్ని మొదటి పార్ట్ లో గోడమీద పటాలకే పరిమితం చేశారు. అయితే ఆ పాత్రను కూడా ప్రభాస్ పోషించారు. అతని గురించి చిన్న సీన్ బాహుబలి 2 లో ఉంటుందని సమాచారం.
అనుష్క బాహుబలి బిగినింగ్ లో అనుష్కను పూర్తిగా డీగ్లామర్ గా చూపించారు. ఖైదీగా ఉన్న దేవసేనగా అభినయంతో స్వీటీ ఆకట్టుకున్నారు. వీరనారిగా, సౌందర్య రాశిగా కంక్లూజన్ లో అలరించనున్నారు. ట్రైలర్లో సాధారణంగా కాస్త బొద్దుగా ఉన్న అనుష్కను రాజమౌళి తన మాయాజాలంతో చాలా నాజూగ్గా, అందంగా చూపించాడు. ప్రభాస్, అనుష్కల మధ్య రొమాన్స్ తెర మీద సూపర్ గా ఉండనుందని తెలిసిపోతుంది.
తమన్నా బిగినింగ్ లో అవంతికగా తమన్నా ఫైట్స్, డ్యాన్స్ తో అదరగొట్టింది. కంక్లూజన్ లో ఆమె ఎక్కువ సేపు కనిపించక పోయినా క్లైమాక్స్ లో తమన్నా చేసే పోరాటాలు వావ్ అనిపించనున్నాయి.
రానా రాజ్యాధికారంపై మోజు, దేవసేనపై ప్రేమ, బాహుబలి పై ఈర్ష్య అధికంగా కలిగిన వ్యక్తి భల్లాల దేవ. ఈ పాత్రకు మొదటి పార్ట్ లో రానా న్యాయం చేశారు. ఇక అతనిలోని కోపం, పగ ఎమోషన్స్ తో పాటు కండబలాన్ని పూర్తిగా రెండో పార్ట్ లో చూడనున్నాం. ప్రభాస్, రానా ల మధ్య జరిగే పోరాట దృశ్యాలైతే శిఖర స్థాయిలో ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. భారీ శరీర సౌష్టవంతో ప్రభాస్, రానాలు వీరోచితంగా తలపడుతుంటే కనురెప్ప కూడా వేయలేము.
రమ్యకృష్ణ రాజమాత శివగామి పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోశారు. ఆమె రాజసం ఎందరికో స్ఫూర్తి. ఎంత రాజమాత అయినా ఓ బిడ్డకి తల్లే. ఆమె లోని ఆ మాతృత్వాన్ని బాహుబలి 2 లో చూడనున్నాం. అమరేంద్ర బాహుబలిని చంపేయాలని చెప్పినప్పుడు ఆమె పడే వేదన, మహేంద్ర బాహుబలి ని రక్షించే సమయంలో పడే తపన వంటి ఎన్నో ఎమోషన్స్ కన్నీరు తెప్పించక మానవు.
సత్యరాజ్ బాహుబలి 2 మొత్తం కట్టప్ప పాత్ర మీదే ఆధారపడి ఉంది. బాహుబలిని చంపేయడానికి గల కారణం ఏమిటో అతనే రివీల్ చేయనున్నారు. ఆ విషయం తెలుసుకోవడానికి రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా కట్టప్ప నీతి నిజాయితీ, అంకిత భావం కంక్లూజన్ లో పూర్తిగా బయట పడనుంది.
నాజర్ విషం తాగి.. విషం కక్కే వ్యక్తి బిజ్జల దేవుడు. ఈ పాత్రలో నాజర్ కర్కశంగా నటించారు. కొడుకు భల్లాల దేవకు లేనిపోని ఆలోచనలు కల్పించి అడ్డదారిలో నడిపిస్తుంటాడు. చివరికి శివగామినిని కూడా చంపించాలని కొడుకుని ఉసిగొల్పుతాడు. “భల్లా.. నీకు ఎప్పుడైనా .. మీ అమ్మను చంపాలనిపించిందా?” అని బిజ్జల దేవుడు చెప్పే డైలాగ్ వింటుంటే పార్ట్ 2 లో అతని ఆలోచనలు ఎంతో భయంకరంగా ఉంటాయో అర్ధం అవుతోంది.
సుబ్బ రాజుపార్ట్ 1 లో కాలకేయుడి పాత్ర బాగా గుర్తింపు తెచ్చుకుంది. కంక్లూజన్ లో అతని లేని లోటుని సుబ్బరాజు పాత్ర పూడ్చనుంది. బాహుబలి కంక్లూజన్ లో అతని రోల్ ఏమిటో బయటికి రాలేదు కానీ కాలకేయుడి కంటే క్రూరంగా కనిపించనున్నట్లు సమాచారం. కథలో అతని పాత్ర కీలకం కానుందని, ఈ రోల్ సుబ్బరాజు సినీ కెరీర్ కి మంచి బూస్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది.