గీతా ఆర్ట్స్‌లో భాగంగా ఉండేటప్పుడు బన్ని వాస్ విషయంలో ఓ మాట ఎక్కువగా వినిపించేది. ఆయన కథల ఎంపిక విషయంలో చాలా క్లారిటీ ఉంటుందని, ఎలాంటి కథలు విజయాలు సాధిస్తాయో ఆయనకు పట్టు ఉందని చెప్పేవారు. ఆయన ఆ బ్యానర్ టీమ్‌తో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందికర ఫలితాలు వచ్చినా ఎక్కువ శాతం విజయాలే అని చెప్పేవారు. అయితే ఆయన ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో లేరు. బయటకు వచ్చి ఇతర నిర్మాతలతో కలసి కొన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఓ సినిమా ఇబ్బందికర ఫలితం అందుకుంది. దాని గురించి ఆయన ఇటీవల ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
గీతా ఆర్ట్స్ వారి రెండో బ్యానర్ ‘జీఏ2’ మీద బన్నీ వాసు సినిమాలు నిర్మించేవారు. ఈ మధ్యే సొంతంగా ‘బన్నీ వాసు వర్క్స్’ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నారు. ఇతర నిర్మాతలు నిర్మించిన సినిమాలను తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువగా వంశీ నందిపాటితో కలసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ మంచి ఫలితాలు అందుకున్నాయి. వీటి మధ్యలో ‘మిత్రమండలి’ అనే సినిమా మిస్ అయింది. ఎందుకంటే ఆ సినిమా చాలా ఇబ్బంది పెట్టింది.

నిహారిక ఎన్.ఎం, ప్రియదర్శి లాంటి కాస్త పేరున్న నటులే ఉండటం, బన్ని వాస్ తన టాలెంట్‌తో ప్రచారం చేయడంతో ‘మిత్రమండలి’ సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ ఈ సినిమా వల్ల రూ.6 కోట్లు పోయారాయన. ఈ సినిమా ఎక్కడ తేడా కొట్టిందో కూడా ఆయనే వివరించారు. ‘మిత్రమండలి’ సినిమా బాగా ఆడుతుందని అనుకున్నాం. మేకింగ్ టైంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కామెడీ వర్కవుట్ అవుతుందని.. జనాలను నవ్వించగలమని అనుకున్నాం. కానీ ఎడిటింగ్‌లో తప్పు జరిగింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సరిగా చేయలేదు అని చెప్పారు.
అంతేకాద ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఆయన ఫైనల్ కాపీ చూడలేదట. అప్పటికే అనుకున్న కార్యక్రమా కారణంగా ఆయన సినిమాకు దూరంగా ఉన్నారట. అదే సినిమా ఫలితాన్ని తేడా కొట్టించింది అని చెప్పారు బన్ని వాస్. అయితే ఈ సినిమా విడుదల తేదీ వరుసగా మారుతూ మారుతూ వచ్చింది. అయినా ఆయన అందుబాటులో లేకపోవడమేంటో అర్థం కావడం లేదు.
