మగధీర, మర్యాద రామన్న, బాహుబలి.. సినిమా ఏదైనా.. సెట్స్ తప్పనిసరి. కథకు తగ్గట్టు సెట్స్ ఉండడంవల్ల రాజమౌళి ప్రశాంతంగా సినిమాని తెరకెక్కించగలరు. అందుకోసమే ఇప్పుడు కూడా సెట్స్ మీద దృష్టి పెట్టారు. బాహుబలి సినిమాలా తర్వాత జక్కన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్.. బోయపాటి సినిమాతో, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉండగా రాజమౌళి మాత్రం మల్టీ స్టారర్ మూవీ కోసం పక్కా ప్రణాళికతో సాగుతున్నారు. ఓ వైపు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటూనే.. ఈ సినిమాకి అవసరమైన సెట్స్ పనులను మొదలెట్టారు. అయితే ఈసారి రామోజీ ఫిలిం సిటీ కాకుండా.. గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంతంలో అనేక సెట్స్ వేసేలా నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని రెండు సంవత్సరాలపాటు లీజ్ కి తీసుకున్నట్టుగా తెలిసింది. అంటే ఈ సినిమా షూటింగ్ రెండేళ్లు సాగనున్నట్లు అర్ధమవుతోంది. బాహుబలికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పర్యవేక్షణలో అక్కడ నిర్మాణ డిజైన్స్ మొదలయినట్లు సమాచారం. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్స్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కీర్తి సురేష్, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మెగా, నందమూరి కలయికలో రూపుదిద్దుకోనున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.