హైపర్

ఎనర్జిటిక్‌ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘హైపర్’. ‘నేను శైలజ’ వంటి హిట్ తర్వాత రామ్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కందిరీగ’ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో ‘హైపర్’పై అంచనాలు మరింతగా పెరిగాయి. గిబ్రాన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రామ్ కు తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా వుందో, ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూద్దామా!

కథ : నిజాయితీ పరుడైన ప్రభుత్వ ఉద్యోగం చేసే నారాయణ మూర్తి(సత్యరాజ్) కొడుకు సూర్య(రామ్). మధ్యతరగతి జీవితం గడుపుతుంటారు. సూర్యకి తండ్రంటే చాలా ప్రేమ. తండ్రి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్ళే మనస్తత్వం కలవాడు. నారాయణ మూర్తి తన రిటైర్మెంటుకు దగ్గర్లో ఉంటాడు. ఇక రాజప్ప అనే మినిష్టర్ నెగెటివ్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తాను వైజాగ్ లో కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్స్ కు పర్మిషన్ ఇవ్వాలంటూ నారాయణ మూర్తిపై రాజప్ప ఒత్తిడి తెస్తాడు. దీనికి నారాయణ మూర్తి నిరాకరిస్తాడు. అందువల్ల సత్యరాజ్ కుటుంబంపై రాజప్ప దాడులు, కుట్రలు చేయిస్తాడు. విషయం తెలుసుకున్న సూర్య తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఉంటాడు. అయితే రాజప్ప జీవితంలోకి సూర్య ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది? రాజప్ప ఏం చేశాడు? రాజప్ప దాడులను సూర్య ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఏం జరిగింది అనే విషయాన్ని వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల పనితీరు : టైటిల్ కు తగ్గట్లే రామ్ తన ఎనర్జిటిక్‌ పర్ఫార్మెన్స్ తో చాలా చక్కగా నటించాడు. తండ్రి అంటే పిచ్చి ఉన్న కొడుకు పాత్రలో రామ్ అధ్బుతం నటనను కనబరిచాడు. ఇక ఫైట్స్, డాన్స్, రొమాంటిక్ సీన్లలో దుమ్మురేపాడు. ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్లలో హైపర్ చూపించేసాడు. ఈ పాత్రలో రామ్ తప్ప ఇంకెవరు చేయలేరనే విధంగా చేశాడు. ఇక రామ్ తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొడుకు చూపించే ప్రేమను తట్టుకోలేని ఓ తండ్రిగా బాగా చేశారు. రామ్-సత్యరాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. అటు ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా బాగా కుదిరింది. ఇక బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా సినిమాకు గ్లామర్ ను తెచ్చింది. తన అందచందాలు బాగా ప్లస్ అయ్యాయి. రొమాంటిక్, లవ్, కామెడి సీన్లలో రాశి చక్కగా నటించింది. రామ్-రాశిఖన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక రాజప్ప పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టేసాడు. తనదైన నటనతో ఆకట్టుకుంటూ, సినిమాకు బాగా హెల్ప్ అయ్యాడు.

సాంకేతికవర్గం పనితీరు : ఈ సినిమాతో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మరోసారి హిట్టు కొట్టాడని చెప్పుకోవచ్చు. కథ పరవాలేదనిపించిన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. ఒక ఫ్యామిలీ ఎమోషన్ స్క్రిప్ట్ కు కమర్షియల్ వాల్యూస్ ను జతచేసి, పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. కొన్ని కొన్ని సీన్లను బాగా డిజైన్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ అంతగా కిక్కు అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో రాశి ఖన్నా పాటలకే పరిమితం అయినట్లుగా అనిపిస్తుంది. పాటల సందర్భాలు మైనస్ గా నిలిచాయి. గిబ్రాన్ సంగీతం పర్వాలేదు. మణిశర్మ రీరికార్డింగ్ బాగుంది. సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ సూపర్. విజువల్స్ పరంగా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు. సినిమా అంతా కూడా కలర్ ఫుల్ ఉంది. అబ్బూరి రవి అందించిన మాటలు బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ బాగా రిజిస్టర్ అయ్యాయి. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. గ్రాండ్ లుక్ తో ‘హైపర్’ అదిరిపోయింది.

విశ్లేషణ : ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ ఈసారి ఎంటర్ టైన్మెంట్ తో పాటుగా కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సగటు ప్రేక్షకుడు సైతం ఎంటర్ టైన్ అయ్యే విధంగా ‘హైపర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. మొత్తానికి ‘కందిరీగ’ తర్వాత రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో హిట్టు పడిందనే చెప్పుకోవచ్చు.

Rating : 2.5/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus