మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000లో బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో రెండు చిత్రాలలో నటించిన ఆమె హీరోయిన్ గా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి, పవన్ హీరోగా చేసిన కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. 2003లో వచ్చిన జానీ సినిమా తరువాత ఆమె ముఖాన్ని రంగు వేసుకున్నది లేదు. ఐతే ఆమెకు ప్రస్తుతం నటనపై ఆసక్తి పెరిగినట్లు తాజా పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది.
ఇటీవల ఆమె మొదటి చిత్రం బద్రి సినిమా 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఫ్యాన్స్ తో లైవ్ లో ముచ్చటించారు. ఈ లైవ్ చాట్ లోకి బద్రి సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ రావడంతో ఆమె చాలా ఆనందంగా అప్పటి జ్ఞాపకాలు పంచుకున్నారు. కాగా ఆ లైవ్ చాట్ లో పూరీని తన సినిమాలో ఓ రోల్ ఇవ్వాలని, ఓల్డ్ లేడీ పాత్ర అయినా పరవాలేదు అని అడిగారు. దీనికి పూరి అలాంటి పాత్ర ఇస్తే మీ ఫ్యాన్స్ నన్ను కొడతారు, మీకు తగిన పాత్ర ఇస్తాను అని రేణుకు ఆయన హామీ ఇచ్చారు.
మళ్ళీ రేణు తనకు మహేష్ బాబు తల్లి పాత్ర చేయాలని ఉందని ఆసక్తికరమైన కోరిక కోరారు. మహేష్ సినిమాలో చేసే అవకాశం కావాలన్న ఆమె ఆయనకు తల్లి పాత్ర కోరుకోవడం కొంచెం విచిత్రంగా అనిపించింది. మహేష్ సమకాలీన హీరోయిన్ మహేష్ కి తల్లిగా సెట్ అవుతుందా అనే అనుమానం దర్శకులకు కలిగినప్పటికీ కాంబినేషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశం కలదు. మహేష్ దర్శకులు ఆమె కోరిక తీరుస్తారో లేదో చూడాలి.