పాపులర్ యాంకర్ రవి హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “ఇది మా ప్రేమకథ”. అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకొన్న మేఘన లోకేష్ కథానాయికగా పరిచయమైంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : అరుణ్ (యాంకర్ రవి)-సంధ్య (మేఘన లోకేష్) కాలేజ్ లో పరిచయమై.. తొలిచూపులోనే ఒకర్నొకరు ఇష్టపడతారు. వారి ప్రేమను పెద్దలు సైతం అంగీకరించడంతో.. ముందు సెటిల్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ.. కారణాంతరాల వలన పెళ్ళికి ముందే ఇద్దరి మధ్య గొడవలు మొదలై.. విడిపోతారు. అసలు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలేమిటి? మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి దోహదపడిన అంశాలేమిటి? అనేది “ఇది మా ప్రేమకథ” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : గత కొన్నేళ్లుగా రకరకాల టీవీ షోస్, సీరియల్స్ లో నటిస్తూ వస్తున్న యాంకర్ రవికి కెమెరా ఫేస్ చేయడం కొత్త కాకపోవడంతో సునాయాసంగా అరుణ్ పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే.. ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలోనూ అలరించాడు. యాంకర్ రవి కంటే సీనియర్ (మరి అమ్మాయి చిన్నప్పటి నుండి నటిస్తుంది) అయిన మేఘన లోకేష్ కూడా ఎఫర్ట్ లెస్ గా సంధ్య పాత్రను పండించింది. తెలుగు తెలిసిన అమ్మాయి కావడంతో లిప్ సింక్ కూడా ఎక్కడా మిస్ అవ్వలేదు. ఇక సపోర్టింగ్ రోల్ లో గెటప్ శ్రీను, సూర్య, వైజాగ్ ప్రసాద్, తులసిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : కార్తీక్ కొడకండ్ల బాణీలు బాగున్నాయి. కానీ.. వాటి చిత్రీకరణ బాగోకపోవడంతో సాంగ్స్ జనాలకి పెద్దగా ఎక్కవు. ఇక నేపధ్య సంగీతం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. సన్నివేశాల్లో సెన్స్ లేనప్పుడు ఎంత మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినా లాభం ఏముంటుంది. ఇక సినిమాటోగ్రాఫర్ మురళీమోహన్ రెడ్డి కష్టాలు మామూలువి కావు. తనకు లభించిన అతి తక్కువ వనరులతో సినిమాని వీలైనన్ని ఎక్కువ ఫ్రేమ్స్ తో ఎలా తీయాలా అనే తపన ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. కానీ.. దర్శకుడికి సినిమా పట్ల సరైన అవగాహన లేకపోవడం.. కెమెరామెన్, ఎడిటర్, డి.టి.ఎస్ మిక్సింగ్, కలరింగ్ వంటి అన్నీ టెక్నికల్ విషయాల పట్ల కనీస స్థాయి నాలెడ్జ్ లేకపోవడంతో అవన్నీ సినిమాకు మైనస్ లే అయ్యాయి. ఇక దర్శకుడు అయోధ్య కార్తీక్ గురించి చెప్పాలంటే.. యూట్యూబ్ కోసం షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీసేవారికుండే సగం నాలెడ్జ్ కూడా దర్శకుడికి లేదు. సన్నివేశాలన్నీ ఏదో పేర్చినట్లుగా ఉంటాయి. ఇక స్క్రీన్ ప్లే అయితే.. ఇది ఈమధ్య కాలంలో తీసిన సినిమానేనా లేక ఎప్పుడో 80ల కాలంలో తీసి ఇప్పుడు రిలీజ్ చేశారా అనిపిస్తుంది.
విశ్లేషణ : నటీనటులు ఎంతమంది ఉండి, ఎంతలా తమ నట ప్రతిభను ప్రదర్శించినా.. దర్శకుడికి క్లారిటీ కానీ విజన్ కానీ లేకపోతే వచ్చే అవుట్ పుట్ “ఇది మా ప్రేమకథ”లా ఉంటుంది. సో, ఈ సినిమాని థియేటర్ లో మాత్రమే కాదు కనీసం యూట్యూబ్ లో కూడా ఫార్వార్డ్ చేయకుండా చూడడం మహా కష్టం.