పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికిగాను సరైన గుణపాఠం చెప్పాలని దేశం మొత్తం కోరుకుంటోంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు చెప్పుదెబ్బ లాంటి సమాధానం ఇవ్వాలనేది అందరి ఆశ. ఈ క్రమంలో మన సైన్యం రియాక్ట్ అవుతుంది అని వార్తలొచ్చినా.. అది ఇంత త్వరగా జరుగుతుంది అని అనుకోలేదంతా. శత్రువే కాదు మనం కూడా ఊహించని విధంగా మే 6న అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మన సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ నేపథ్యంలో వైమానిక దాడుల నేపథ్యంలో వచ్చిన కొన్ని చిత్రాలపై (Indian Movies) ఓ లుక్కేయండి.
1965 దాడుల నేపథ్యంలో..
అక్షయ్ కుమార్ (Akshay Kumar) , వీర్ పహాడియా నటించిన ‘స్కై ఫోర్స్’ సినిమా ఇటీవల ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌కి వచ్చింది. అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహించారు. 1965లో పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం చేసిన తొలి వైమానిక దాడి నేపథ్యంలో ఈ సినిమా (Indian Movies) సాగుతుంది.
పుల్వామా దాడి తర్వాత..
పుల్వామా ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) తెరకెక్కించారు. వరుణ్ తేజ్ (Varun Tej), మానుషి చిల్లర్ (Manushi Chhillar) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హుడా (Shakti Pratap Singh) దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో వీక్షించొచ్చు. ఈ దాడి నేపథ్యంలోనే హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పడుకొణె (Deepika Padukone) నటించిన చిత్రం ‘ఫైటర్’ (Fighter). ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన చర్యల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ‘రక్షక్: ఇండియాస్ బ్రేవ్ చాప్టర్ 2’. దీనిని ప్రైమ్ వీడియోలో వీక్షించొచ్చు.
ఉరి – బాలాకోట్
‘రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’ వెబ్ సిరీస్.. బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలోనే తెరకెక్కింది. సంతోష్ సింగ్ నటించిన ఈ సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో వీక్షించొచ్చు. ఉరి సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ వైమానిక దాడి తరహా సంఘటనల నేపథ్యంలో రూపొందిన మరో సిరీస్ ‘అవరోధ్: ది సీజ్ వితిన్’. సోనీ లివ్‌లో ఈ వెబ్‌సిరీస్‌ను వీక్షించొచ్చు. విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో ఉరి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను జీ5లో వీక్షించొచ్చు.