కమల్ హాసన్ తర్వాత తెలుగు-తమిళ భాషల్లో అదే స్థాయిలో సినిమాలోని పాత్ర కోసం కష్టించే మనస్తత్వం గల సంపూర్ణ నటుడు విక్రమ్. అయితే.. ఈమధ్యకాలంలో సరైన హిట్ లేక డీలా పడ్డాడు. అందుకే.. ఈమారు పూర్తి స్థాయిలో ప్రయోగానికి మాత్రమే కాక కాస్త వైవిధ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి విక్రమ్ నటించిన చిత్రం “ఇంకొక్కడు”. నయనతార, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం పోషించడం విశేషం. మరి “ఇంకొక్కడు” విశేషాలేంటో చూసేద్దాం..!!
కథ : మలేసియాలోని ఇండియన్ ఎంబస్సీపై ఓ 70 ఏళ్ల ముసలి వ్యక్తి ఎటాక్ చేసి.. ఏకంగా ఎనిమిదిమంది పోలీస్ ఆఫీసర్స్ ని ఒంటి చేత్తో హతమారుస్తాడు. ఓ ముదుసలి వ్యక్తి అంతమందిని ఎలా హతమార్చాడు అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఈ కేస్ ను డీల్ చేయాల్సిందిగా ఇండియన్ స్పెషల్ ఏజెంట్ అఖిల్ (విక్రమ్)ను నీయమిస్తారు. అఖిల్ ఇన్వాల్వ్ మెంట్ తో ఈ ఎటాక్ వెనుక “లవ్” అనే వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. అఖిల్ తోపాటు ఆరుషి (నిత్యామీనన్)ను మలేసియా పంపిస్తుంది ఇండియన్ గవర్నమెంట్. కట్ చేస్తే.. లవ్ (రెండో విక్రమ్) ఆస్తమా వ్యాధిగ్రస్తులు వినియోగించే మిషన్ ద్వారా ఓ టాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేయనున్నాడని తెలుసుకొంటాడు అఖిల్. మరి అఖిల్ తన ప్రత్యర్ధి లవ్ ను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ టాక్సిన్ మలేసియా దాటకుండా ఆపగలిగాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే “ఇంకొక్కడు”.
నటీనటుల పనితీరు : అఖిల్ అనే స్పెషల్ ఏజెంట్ పాత్రలో నిబద్ధత కలిగిన ఆఫీసర్ గా, “లవ్” పాత్రలో ట్రాన్స్ జెండర్ గా విక్రమ్ మరోమారు తన నటవిశ్వరూపం చూపాడు. అయితే.. ట్రాన్స్ జెండర్ రోల్ లో హావభావాల వరకూ ఒకే కానీ.. బాడీ లాంగ్వేజ్ విజయంలో మాత్రం చాలా చోట్ల తడబడ్డాడు. హీరో-విలన్ గా ద్విపాత్రాభినయం చేయాలనుకోవాలన్న తపన బానే ఉంది, కానీ దానికి తగ్గట్లుగా మేకప్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోని కారణంగా కొన్ని చోట్ల లవ్ పాత్ర ఎబ్బెట్టుగా అగుపిస్తుంటుంది. నిన్నమొన్నటివరకూ గ్లామర్ డాల్ గానే మిగిలిపోయిన నయనతార ఇటీవల “నేనూ రౌడీనే” చిత్రంలో చెవిటి యువతిగా ఎలా అయితే నటిగానూ తనను తాను ప్రూవ్ చేసుకొందో “ఇంకొక్కడు” చిత్రంలోనూ ఇంటెలిజెన్స్ అధికారిణిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అదరగొట్టింది. కథలో చాలా కీలకమలుపును తీసుకువచ్చే పాత్ర అయిన మీరాగా అందాలతో కవ్విస్తూనే.. అభినయంతో కట్టిపడేసింది. ఎప్పట్లాగే పాత్ర చిన్నదే అయినా.. తనదైన నటనతో ఆరుషి పాత్రకు ప్రాణం పోసింది నిత్యామీనన్. నాజర్, తంబి రామయ్య తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : మెలోడీకి, టిపికల్ బిజీమ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన హరీష్ జైరాజ్ “ఇంకొక్కడు”కి సమకూర్చిన గీతాల్లో “హెలెనా” తప్పితే మరో గుర్తుంచుకొనే గీతం లేకపోవడం, బిజీమ్స్ విషయంలో ప్రయోగం పేరుతో చిత్రవిచిత్రమైన వాయిద్యాలను కలిపి వాయించేసి ప్రేక్షకులకు దాదాపుగా పిచ్చెక్కించినంత పని చేశాడు. ఇక తమిళ పాటలకు మన తెలుగు రచయితలు ప్రాసల కోసం ప్రాకులాడి సమకూర్చిన సాహిత్యం “నా భూతో నా భవిష్యత్” అన్నట్లుగా ఉంది. ఆర్.డి.రాజశేఖర్ తన కెమెరా పనితనంతో మాయ చేయడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ.. కథనం మరీ నత్తనడకలా సాగడంతో ప్రేక్షకుడు విజువల్ బ్యూటీని ఆస్వాదించే స్టేజీ దాటిపోయి రాజశేఖర్ పనితనాన్ని పట్టించుకోలేదు. ఎడిటింగ్ సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. సీన్ టు సీన్ కనెక్టివిటీ అస్సలు కుదరలేదు. దానికి తోడు సీజీ వర్క్ కూడా వికటించడంతో సీట్ లో కూర్చున్న ప్రేక్షకుడు సహనం కోల్పోయి థియేటర్ లో నుంచి వెళ్లిపోవాలా? ఉండాలా? అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతుంటాడు.
“అరిమనంబి” అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్ ఆ చిత్రంతో దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా విశేషమైన ఆదరణ చూరగొన్నాడు. “ఇంకొక్కడు” సినిమాపై కాస్తో కూస్తో ప్రేక్షకుడు ఆశలు పెట్టుకోవడానికి ముఖ్య కారకుడైన ఆనంద్ శంకరే ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ గా మారడం గమనార్హం. రాసుకొన్న కథలో కొత్తదనం లేకపోగా ఆ కథను నడిపించిన కథనం విధానం చూస్తే.. “అరిమనంబి” చిత్రానికి దర్శకుడు ఇతగాడేనా అనిపించక మానదు. నటుడిగా విక్రమ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు కానీ దర్శకుడిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ : రానురాను మన సౌత్ సినిమాల్లో వైవిధ్యం అనే పదానికి అర్ధం మారిపోతోంది. కొత్త రోగాలు లేదా మందులు కనిపెట్టడమే వైవిధ్యం అనుకొంటున్నారు మన దర్శకులు. “ఐ”లో శంకర్ వింత వింత రోగాలతో భయపెడితే.. “ఇంకొక్కడు”లో ఆనంద్ శంకర్ ఓ సరికొత్త డ్రగ్ తో దాడి చేశాడు. సినిమాలో లాజిక్ అనేది ఎక్కడా కనిపించాడు సరికదా.. స్పై థ్రిల్లర్ అయిన “ఇంకొక్కడు” స్క్రీన్ ప్లే చూస్తే సహనం సన్నగిల్లి.. ఆ సినిమాలో అందరూ వాడే “స్పీడ్” అనే డ్రగ్ ను మింగి మనం కూడా థియేటర్ నుంచి వాయువేగంతో పారిపోతే బాగుంటుందేమో? అనే భావన ప్రేక్షకుడిలో కలగజేస్తుంది.
సో, విక్రమ్ కు వీరాభిమానులైతే తప్ప “ఇంకొక్కడు” చిత్రానికి వెళ్లకపోవడమే బెటర్!