‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది’ అని పెద్ద వాళ్ళు ఎప్పుడో చెప్పారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మహేష్ బాబు, నమ్రత ల గురించి చెప్పుకోవాలి. మహేష్ ఇప్పుడు స్టార్ గా రాణిస్తున్నాడు అంటే తెరవెనుక నమ్రత కృషి కూడా చాలానే ఉంది అనేది బహిరంగ రహస్యమే. మహేష్ బిజినెస్ వ్యవహారాలు, అతని సినిమాల ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారాలు.. ఆమె చక్క బెడుతుంటారు. అయితే ఈరోజు వీళ్ళిద్దరూ ఇలా ఉండడానికి కారణం ఓ ప్లాప్ సినిమా అంటే అతిశయోక్తి కాదు. అది మరేదో కాదు ‘వంశీ’ చిత్రం.2000 వ సంవత్సరం అక్టోబరు 4 న ఈ చిత్రం విడుదలయ్యింది.
ఆ టైములో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న బి.గోపాల్ ఈ మూవీకి దర్శకుడు. పద్మాలయ స్టూడియోస్ పతాకం పై కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు ఈ చిత్రాన్ని నిర్మించాడు. నిజానికి ఈ చిత్రం వెనుక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా నమ్రతని అనుకోలేదట. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రీతి జింగియానీ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అప్పటికే ఆమె బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. దీనికి కూడా బి.గోపాలే దర్శకుడు. వరుసగా తన రెండు సినిమాల్లో ఈమెను రిపీట్ చేయడం ఇష్టం లేక ఆయన కూడా లైట్ తీసుకున్నారు. తర్వాత నమ్రతని తీసుకున్నారు.
ఇంకో విషయం ఏమిటంటే.. మహేష్ కు ‘వంశీ’ సినిమా చేయడం అస్సలు ఇష్టం లేదట. కారణం కథ అతనికి నచ్చకపోవడమే. అయితే నాన్న(కృష్ణ) గారి మాట కాదనలేక ఆ సినిమా చేయాల్సి వచ్చిందని.. అలా చేయడం వలన సినిమా ప్లాప్ అయినా తన జీవిత భాగస్వామి తనకి దొరికిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు మహేష్. ఇక ఈ చిత్రానికి మొదట దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. అప్పటికే అతను ‘దేవి’ అనే హిట్ సినిమాకి సంగీతం అందించాడు. అయితే ‘వంశీ’ సినిమా బడ్జెట్ క్రమక్రమంగా పెరగడంతో మణిశర్మని తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో ‘వెచ్చ వెచ్చగా’ అనే సూపర్ హిట్ పాటకి దేవి శ్రీ ప్రసాదే లిరిక్స్ అందించి ట్యూన్ కూడా సమకూర్చాడన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.