సినిమాల్లో పాటల చిత్రీకరణ అంటే హీరోకు కష్టమా? హీరోయిన్‌కు కష్టమా అనే ప్రశ్న వస్తే.. కచ్చితంగా హీరోయిన్‌కే అని చెబుతారు. అయిత ఆ పాట సెట్స్‌లో కాకుండా ఔట్‌డోర్‌లో షూట్ చేసి ఉండాలి. ఈ సమస్య గురించి చాలామంది కథానాయికలు గతంలోనూ చెప్పారు, ఇప్పుడు కూడా అడపాదపడా మాట్లాడుతూనే ఉన్నారు. గత తరం నాయిక ఒకరు తన సినిమాలో ఓ పాట కోసం పడ్డ ఇబ్బంది గురించి ఓ సందర్భంలో ప్రస్తావించారు.
‘బొంబాయి’ (Bombay) సినిమా చూశారా? అందులో ‘ఉరికే చిలకా..’ పాట గుర్తుందా? భలే ఉంటుంది కదా పాట.. అరవింద్ స్వామి (Arvind Swamy) , మనీషా కొయిరాలా (Manisha Koirala) ఓ పాడుబడిన భవనం దగ్గర, పైన పాట పాడుకుంటారు. స్టెప్పులేమీ ఉండవు, కేవలం భావోద్వేగాలతో ఆ పాట నడుస్తుంది. అయితే ఆ పాట షూటింగ్ సమయంలో హీరోయిన్ మనీషా కొయిరాలా చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారు. దానికి కారణం ఆ పాత బిల్డింగే అని చెప్పారు. ఎంతో మంది ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఈ పాట తనకు చాలా కష్టమైనదని మనీషా చెప్పుకొచ్చింది.
ఆ పాట చిత్రీకరణ జరిపిన సముద్రం ఒడ్డున ఉన్న ఓ పురాతన కట్టడంలో పెద్ద పెద్ద రాళ్లు, ముళ్లపొదలు, చెట్లు ఉన్నాయని గుర్తు చేసింది. ఆ ప్రదేశం మొత్తం జలగలే ఉన్నాయని.. అవి ఎక్కడ పట్టేస్తాయేమో అని భయపడ్డానని మనీషా చెప్పుకొచ్చింది. ఆ పాటలో పొడవాటి నీలిరంగు దుస్తులతో పరుగెత్తాలని, అప్పుడు కాలు కాస్త అదుపు తప్పి అటు ఇటు వెళ్తే జలగలు పట్టిస్తాయేమోనని భయపడ్డానని నాటి భయంకర పరిస్థితిని మనీషా తెలిపింది.
అయితే తన పరిస్థితిని అర్థం చేసుకున్న సినిమా టీమ్, ఆ ప్రదేశంలో ఉప్పు చల్లారని దాని వల్ల కాస్త సమస్య తగ్గిందని, అయితే ఇంకాస్త జాగ్రత్త కోసం బూట్లు కూడా ఇచ్చారని తెలిపింది. అయితే అవే జలగలు హీరోకు కూడా ఇబ్బంది పెడతాయి కదా అంటరా? మన హీరోలు ఎక్కువగా షూ వేసుకుంటారు కదా.