‘కన్నప్ప’ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఆమె ఆ సినిమాలో నటిస్తోంది అనే అనౌన్స్‌మెంట్ మిస్ అయి ఉంటే ఈ విషయం తెలియదు. ఇక సినిమా ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు కాబట్టి అలా కూడా తెలియదు. కేవలం సినిమా చూసినవారికి మాత్రమే తెలుస్తుంది. ఆ సినిమాలో ఆమె చెంచు యువరాణి నెమలి అనే పాత్రలో కనిపించింది. ఆమె గురించి అలా అలా వెతికితే కొన్ని ఆసక్తికర ఆసక్తులు, విషయాలు కనిపించాయి. వాటిలో కొన్ని ఇవీ..
ప్రీతి మొదటి తెలుగు సినిమా శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’. ‘కన్నప్ప’ రెండో సినిమా. డాక్టర్ల ఇంటి నుండి వచ్చిన యాక్టర్ ప్రీతి ముకుందన్. తమిళనాడుకి చెందిన ఈ చిన్నది బాగా చదువుకునేది. ఎన్‌ఐటీ తిరుచ్చిలో ఇంజినీరింగ్ కూడా చేసింది. చిన్నతనం నుండి భరతనాట్యం, హిప్‌హాప్, వెస్ట్రన్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇంత నేర్చుకున్నాక కాలేజీ రోజుల్లో ప్రైజ్‌లు రాకుండా ఎందుకుంటుంది. బాగానే వచ్చాయి. ఈ క్రమంలో కొంతమంది స్నేహితులు చెప్పడంతో మోడలింగ్‌కి వచ్చి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.
డ్యాన్స్ అంటే ఇష్టమున్న నాయిక కదా.. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. వాటికి యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చాయి. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చింది కదా.. తొలి నాళ్లలో సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయాయట. దాంతో చాలాసార్లు కన్నీరు పెట్టుకుందట. పర్‌ఫ్యూమ్స్, లిప్‌స్టిక్స్, షూస్ కొత్తవి కనిపిస్తే ఠక్కున కొనేస్తుంది. అంత ఇష్టమట అవంట. ఇక ఇంట్లో ఉంటే వంట చేయాలని ఆసక్తి చూపిస్తుందట. ఆ రోజు అమ్మకు రెస్టే అని చెప్పింది ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో.
ఇక ఖాళీ సమయాల్లో ఏం చేస్తావ్ ‘నెమలీ’ అని అడిగితే.. ఎంచక్కా బుక్స్ చదువుతా, కవితలు రాస్తా అని చెప్పింది. మరి ఫిట్‌నెస్ సంగతేంటి అంటే రోజూ యోగా చేస్తాగా అని అంది. మరి జిమ్ అంటే వీలైనప్పుడు వెళ్తా అని చెప్పింది. ఇంకా సమయం ఉంటే నెయిల్ ఆర్ట్ వేస్తా అని తన హిడెన్ టాలెంట్ గురించి చెప్పింది ప్రీతి ముకుందన్.