మెగాస్టార్ చిరంజీవి – హిట్ మెషీన్ అనిల్ రావిపూడి – లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మెగా 157’. ఈ వర్కింగ్ టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేసినా.. ఈ సినిమా మాట్లాడుకునేటప్పుడు అందరూ వాడుతున్న పదం ‘రఫ్ఫాడించేద్దాం’. ఎందుకంటే ఈ సినిమా ప్రచారానికి సంబంధించిన ప్రతి వీడియో ఈ పదంతోనే ముగిసింది. సినిమా ప్రారంభం రోజున చేసిన వీడియో.. నయనతార సినిమా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో కానీ.. రెండింటా రఫ్ఫాడించేద్దాం అనే పదమే వాడారు.
ఇక ఈ సినిమా సోషల్ మీడియా పోస్టుల్లోనూ ఈ పదమే వినిపిస్తోంది. అంతలా సినిమా గురించి వాడిన ఈ పదాన్ని ఇప్పుడు టైటిల్‌గా తీసుకోవడం లేదా? ఏమో గత కొన్ని రోజులుగా సినిమా గురించి వస్తున్న వార్తలు, పుకార్లను చూస్తుంటే సినిమాకు ఈ మాస్ టైటిల్ కాకుండా ఓ క్లాస్ టైటిల్ పెడదాం అని అనుకుంటున్నారట. దాని కోసం ఓ చిన్న లీకును కూడా బయటకు వదిలారు. అదే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అవును ఈ పేరును ఇప్పుడు పరిశీలిస్తున్నారని సమాచారం.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 22న ఈ టైటిల్‌తోనే గ్లింప్స్ రిలీజ్ చేస్తారట. ఆ రోజు స్పెషలేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి డ్రిల్ మాస్టర్‌గా కనిపించనున్నారు అని సమాచారం. ఆ మధ్య పిల్లలతో ఓ స్పెషల్ వీడియో చేసింది కూడా ఆ విషయాన్ని చూచాయగా చెప్పడానికే అని అంటున్నారు. అయితే ఈ పాత్ర కొంత సేపే ఉంటుంది అంటున్నారు.
పూర్వాశ్రమంలో శంకర్ వరప్రసాద్ పోలీసుగా ఉండొచ్చు అని అంటున్నారు. అక్కడే వెంకటేశ్ పాత్ర ఎంటర్ అవుతుంది అని చెబుతున్నారు. త్వరలో ఈ సీన్స్ తెరకెక్కిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ ఈ నెలలో ఉంటుంది అని సమాచారం. మరి వెంకీ సెట్స్‌లోకి వచ్చినప్పుడు ఎలాంటి స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారో చూడాలి.