సంచలనాలు ప్లాన్ చేస్తే జరగవ్ అలా కలిసి రావాలి అంతే. అలాంటి సంచలనమే మహేష్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి చిత్రం. మహేష్ ని పోకిరిగా చూపించి పూరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. మహేష్ హీరోయిజం కి పూరి మేనరిజం తోడైతే తెరపై ఎంత రచ్చ జరుగుతుందో నిరూపించిన మూవీ. ‘ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు…., ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం..’అనే డైలాగ్స్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ తుడిపెట్టిన ఇండస్ట్రీ హిట్ కొట్టిన పోకిరి విడుదలై నేటికి ఖచ్చితంగా 14ఏళ్ళు. 2006 ఏప్రిల్ 28న పోకిరి విడుదలై అనేక రికార్డ్స్ నెలకొల్పింది. హీరోయిన్ ఇలియానాకు స్టార్ హీరోయిన్ హోదా తెచ్చిపెట్టింది. మరి ఈ సంచలన చిత్రానికి నాంది ఎక్కడ పడింది, ఈ మూవీ విషయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందా..
మహేష్ ని మొదట ఉత్తమ్ సింగ్ అనుకున్న పూరి
ఈ సినిమా స్టోరీ నేరేట్ చేయడానికి మహేష్ ఇంటికి వెళ్లిన పూరి స్టోరీ మొదలుపెడుతూ..ఉత్తమ్ సింగ్ అనే ఓ పంజాబ్ కుటుంబానికి చెందిన అనాధ కుర్రాడు, మాఫియా ముఠాలలో ఉంటూ క్రైమ్స్ చేస్తూ ఉంటాడు, కట్ చేస్తే క్లైమాక్స్ లో మఫ్టీలో ఉన్న ఐ పి ఎస్ ఆఫీసర్ గా రివీల్ చేస్తాం, ట్విస్ట్ అదిరిపోతుంది’ అన్నారట. కథ విపరీతంగా మహేష్ కి నచ్చిందట..ఐతే ఆ పంజాబ్ ఫ్యామిలీ నేపథ్యం, ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ నచ్చలేదు, అది మార్చి వేద్దాం అన్నారట. అలాగే కథలో హీరో పాత్రకు తగ్గట్టుగా ఏదైనా క్యాచి టైటిల్ కావాలని అడిగితే పూరి పోకిరి టైటిల్ సజెస్ట్ చేయగా అది మహేష్ కి విపరీతంగా నచ్చింది. క్యారెక్టర్ నేమ్ పండు తన భార్య లావణ్యను ముద్దుగా పూరి పిలుచుకునే పేరు.
సూపర్ ఫాస్ట్ గా సినిమా పూర్తి
పోకిరి సినిమాను పూరి 70రోజుల్లేనే పూర్తి చేశారట. దాదాపు మహేష్ పై వచ్చే అన్ని సన్నివేశాలు సింగిల్ టేక్ లో ఒకే చేశాడట. మహేష్ డౌట్ కొట్టి ఏంటి అన్ని సింగల్ టేక్ లో ఒకే చేస్తున్నారు అన్నారట .అద్భుతంగా వస్తుంది సెంకండ్ టేక్ అవసరమైతే చెవుతాను అన్నారట. సెట్స్ పైకి ఎంత వేగంగా వెళ్ళిందో అంతే వేగంగా పోకిరి సినిమా పూర్తి చేశారు పూరి.
అట్టర్ ప్లాప్ ఖాయం అన్నారు
షూటింగ్ పూర్తయిన వెంటనే బొమ్మ ఎడిటింగ్ రూమ్ కి చేరింది. ఎడిటింగ్ సమయంలో పోకిరి సినిమా చూసి అందరూ చెప్పిన మాట పూరి, మహేష్ లకు ఓ పెద్ద అట్టర్ ప్లాప్ రాబోతుంది అని. అయినా ఈ మూవీ విజయంపై మాత్రం మహేష్, పూరి చాల కాన్ఫిడెంట్ గా ఉన్నారట. నిజానికి పోకిరి ఫస్ట్ షో తర్వాత కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ యావరేజ్ అన్నారు, తరువాత హిట్, కొద్దిరోజులకు సూపర్ హిట్, కొన్ని రోజులకు ఇండస్ట్రీ హిట్ అన్నారు.
పోకిరి మొదటి ఛాయిస్ ఇలియానా కాదు
నడుము అందాలతో కుర్రకారుని గిలిగింతలు పెట్టిన ఇలియానా ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. శృతిగా ఆమె పాత్ర గ్లామర్ పరంగా కిక్కెక్కిస్తుంది. ఐతే పూరి మొదట ఈ సినిమా కోసం అయేషా టకియాను అనుకున్నారట. పార్వతి మెల్టన్, దీపికా పదుకొనె లను కూడా అనుకున్నారట. ఐతే ఎవరో దేవదాసు మూవీలో చేసిన ఇలియానాను సజెస్ట్ చేయగా పూరి ఆడిషన్స్ జరిపి ఆమెను తీసుకున్నారట.
క్లైమాక్స్ల్ ఫైట్ లో ఆ ఐడియా ఎవరిదంటే
పోకిరి క్లైమాక్స్ ఫైట్ లో మహేష్ ప్రకాష్ రాజ్ గూబ మీద కొడతాడు. దీనితో ఆయన చెవిలో రీసౌండ్ వచ్చి ఏమి వినిపించదు. ఆ ఫైట్ లో ప్రకాష్ రాజ్ ని చూపించేటప్పుడు అతని ఫీలింగ్ ప్రేక్షకుడికి తెలిసేలా బీప్ అని సౌండ్ పెడతారు. నిజానికి ఆ ఐడియా ఫైట్ మాస్టర్ విజయ్ ది అట. ఆ ఆలోచన మంచి ఆదరణ దక్కించుకుంది.
గల గల పారుతున్న గోదారి సాంగ్ రీమిక్స్ చేయడానికి కారణం
పోకిరి మూవీ షూట్ సమయంలో ఫారిన్ లో గౌరీ సినిమాలో కృష్ణ గారి ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటను పోలిన ఇంగ్లీష్ సాంగ్ ని గిటార్ తో ఓ వ్యక్తి ప్లే చేస్తున్నారట. ఇదేంటి ఇది అచ్చు కృష్ణ గారి పాటలా ఉందనుకున్న పూరి, కృష్ణ ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ‘గల గల పారుతున్న గోదారి’ సాంగ్ ని పోకిరి కోసం రీమిక్స్ చేయించారట.