‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనౌన్స్‌మెంట్ ఎలా జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి, తారక్, రామ్‌చరణ్ కలసి ఓ సోఫా మీదా దగ్గరగా కూర్చున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఏం క్యాప్షన్ కూడా పెట్టలేదు. అసలు ఈ సినిమా గురించి రామ్‌చరణ్, తారక్‌కి రాజమౌళి ఎలా చెప్పారు. అసలు ఆ ఫొటో తీసిందెవరు, తీశాక ఏమనుకున్నారు, అసలు కథ ఎప్పుడు చెప్పారు అనేది చాలామంది మదిలో ఉన్న ప్రశ్న ఇది. ఇదే ప్రశ్నను దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ‘ఆర్‌ఆర్ఆర్’ను అడిగేశారు.
రాజమౌళి ఇంట్లోనే ఆ ఫొటో దిగారని క్లారిటీ తీసుకున్న అనిల్ రావిపూడి… ‘కథ విని ఫొటో దిగారా? లేక కాఫీ తాగి ఫొటో దిగారా?’ అనే ప్రశ్న వేశారు. దానికి తారక్…‘ఏమీ తాగలేదు.. ఏమీ వినలేదు’ అనే సమాధానం ఇచ్చాడు. వెళ్లాం రాజమౌళి చెప్పాల్సింది చెప్పేశాడు.. వినేశాం ఫొటో దిగేశాం అని కూడా చెప్పాడు తారక్. విషయం విన్నాక… ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయాలి కదా రాజమౌళి అడిగారట. వెంటనే ఆయనే…
సోఫా మీద ముగ్గురుం కూర్చుందాం అని చెప్పి కూర్చొని కార్తికేయను ఫొటో తీయమన్నారట. ఆయన తీసేశాక అప్పుడు క్యాప్షన్ ఏం పెడదామా అని ఆలోచించారట. అయితే క్యాప్షన్ ఆలోచన కూడా ఎక్కువ సేపు సాగలేదట. ‘ మూడు చుక్కలు… వింక్ ఎమోజీ’ అనుకొని అదే పెట్టేసి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయమన్నారట. కథ ఆ తర్వాత కొద్ది రోజులకు చెప్పారట రాజమౌళి. ఆ ఫొటో ఎంత వైరల్ అయ్యిందనేది మీకు తెలిసిన విషయమే.
కొత్త ప్రాజెక్ట్ కోసం ఈ ఫొటో దిగారా, లేక సరదాగా దిగారా అనేది తెలియక తొలినాళ్లలో ఫ్యాన్స్ చాలా మల్లగుల్లాలు పడ్డారు. అయితే కొద్ది రోజులకే క్లారిటీ వచ్చేయడంతో… అంచనాలు మొదలుపెట్టేశారు. త్వరలో అంటే మార్చి 25న సినిమాను వీక్షించబోతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఒక రోజు ముందే ప్రీమియర్స్ కూడా పడతాయి అంటున్నారు. కాబట్టి ఆ రోజు కూడా చూసేయొచ్చు.