ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎవరికీ కూడా రెండోసారి కథ చెప్పాల్సిన అవసరం రాలేదని.. అందరూ సింగిల్ సిట్టింగ్ లోనే కథకి ఓకే చెప్పారని తెలిపాడు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాకి ముందు నుండే నాగ్ అశ్విన్ ఈ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు.
అలా తన మనసులో అనుకున్న ఒక పాయింట్ ని డెవలప్ చేసి ఓ షేప్ తీసుకొచ్చాడు. ‘మహానటి’ సినిమా సక్సెస్ తరువాత, తన మైండ్ లో కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడట. మూడు నెలల పాటు కూర్చొని తన ఆలోచనకు కథారూపం ఇచ్చాడు. ఆ తరువాత హీరోగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో.. ప్రభాస్ కి మాత్రమే తన కథను హ్యాండిల్ చేయగల సత్తా ఉందని భావించి.. అశ్వనీదత్ సహకారంతో కథ వినిపించాడట.
కథ విన్న ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పాడట. ఆ తరువాత అమితాబ్ బచ్చన్ ను, దీపికా పదుకోన్ ను కలిసి సింగిల్ సిట్టింగ్ లో ఒప్పించాడట నాగ్ అశ్విన్. తన కథలో ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని.. ప్రభాస్ తరువాత బిగ్ బీ, దీపిక పాత్రల నిడివి చాలా ఎక్కువ ఉంటుందని వెల్లడించాడు. సినిమాలో యాక్షన్ సీన్ ఎక్కువగా ఉంటాయని.. నలభై శాతం వరకు యాక్షన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. మార్చి నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నాడు.