మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ వెనుక ఉన్నదెవరు? ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్ని ఫాలో అయిన ఎవరినడిగా చిరంజీవి అనే చెబుతారు. అయితే చిరంజీవి ఎప్పుడూ ముందుకొచ్చి ఈ మాటచెప్పలేదు. ఇప్పడు మరో విషయంలోనూ ప్రకాశ్‌రాజ్ వెనుక చిరంజీవి ఉన్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చిరు మాట వల్లే ప్రకాశ్‌రాజ్ కీలక విషయంలో వెనుకంజ వేశారని అంటున్నారు. ‘మా’ ఎన్నికల సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ను ఇరుకున పెట్టే ఉద్దేశంతో మంచు విష్ణు ప్యానల్,
అతని సన్నిహితులు చేసిన ప్రధాన విమర్శల్లో ‘నాన్ లోకల్’ ఒకటి. ఆయన మీద చేసిన విమర్శల్లో ఇదే కీలకం అని చెప్పొచ్చు. దీంతో ఆయన హర్ట్ అయ్యి… ఏకంగా ‘మా’కు పోటీగా కొత్త అసోసియేషన్ తీసుకొస్తారని ప్రచారం జరిగింది. దానికి ‘ఆత్మ’ అని పేరుపెడుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఆత్మ అంటే… ఆల్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ నేపథ్యంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే ‘గెలిచిన అభ్యర్థులం రాజీనామా చేస్తున్నాం’ అంటూ ఇటీవల ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పింది.
ఈ క్రమంలో కొత్త అసోసియేషన్ కూడా ప్రకటిస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ‘ఆత్మ, ప్రేతాత్మ, పరమాత్మ లాంటిది లేదు’ అని ప్రకాశ్‌రాజ్ తేల్చేశారు. నిజానికి ఆయనకి ఆ ఆలోచన ఉందట. కానీ చిరంజీవి వద్దని వారించడంతో ఆగిపోయారని సమాచారం. ‘మా’కు చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షుడన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ‘మా’ కీలక వ్యవహారాల్లో ఆయన ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’కు పోటీగా వేరే అసోసియేషన్ ఏర్పడటం, అందులోనూ ఆయనకు చెందిన వ్యక్తి నుండి రావడం చిరంజీవికి తలనొప్పిగా మారుతుంది. దీంతో చిరంజీవి వారించారని టాక్.