మనం ఎప్పుడూ చెప్పుకునే మాటనే.. ఏ సినిమా ఎవరికి రాసి పెట్టి ఉంటే వారికే చెందుతుంది. అంతకుముందు ఆ కథ ఎంతమంది దగ్గరకు వెళ్లి వచ్చినా.. ఆఖరికి అసలు వారికి వస్తుంది. ఈ అప్రకటిత సూత్రం ప్రకారం జరిగిందో, లేక బడ్జెట్ – రెమ్యూనరేషన్ల లొల్లి వల్ల జరిగిందో కానీ.. ‘జాట్’ (Jaat) సినిమా రవితేజ (Ravi Teja) చేతి నుండి సన్నీ డియోల్ (Sunny Deol) చేతిలోకి వెళ్లిపోయింది. వెళ్లిపోవడం మాత్రమే కాదు.. భారీ విజయం కూడా అందేసుకుంది. దీంతో ‘హిట్’ సినిమాను రవితేజ మిస్ అయ్యాడా అనే చర్చ నడుస్తోంది.
రవితేజ సరైన విజయం సాధించి చాలా ఏళ్లు అయపోయింది అనే చెప్పాలి. కరోనా – లాక్‌డౌన్ సమయంలో ‘క్రాక్’ (Krack) సినిమానే మాస్ మహారాజ ఆఖరి బ్లాక్‌బస్టర్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలలు దాదాపు నిరాశపరిచాయి ఒక్క ‘ధమాకా’ (Dhamaka) తప్ప. అయితే ‘క్రాక్’ సినిమా తీసిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మరో సినిమాను రవితేజతో అనుకున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ భారీగా జరిగింది కూడా. అయితే సినిమా త్వరలో ప్రారంభం అనగా ఆగిపోయింది.
అక్కడికి కొద్ది రోజులకు అదే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ సినిమా అనౌన్స్ అయింది. రవితేజకు ఓకే అనుకున్న కథనే బాలీవుడ్ స్టయిల్‌లో తీస్తున్నారు అని వార్తలొచ్చాయి. ఇప్పుడు సినిమా చూస్తే అలానే అనిపిస్తోంది కూడా. అయితే ఈ సినిమా సాధించిన విజయం చూశాక రవితేజ మంచి విజయం అందుకున్న సినిమా మిస్ అయ్యాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.
కానీ.. తెలుగు సినిమా (శరీరానికి)కు బాలీవుడ్ తలకాయ పెట్టినట్లుగగా ‘జాట్’ సినిమా ఉంది. మరి ఆ కథను రవితేజ చేసి ఉంటే కొత్తదనం ఏముంది అనే పెదవి విరుపు వినిపించేది. కాబట్టి రవితేజ హిట్ సినిమాను మిస్ అయి ఉండొచ్చు. అయితే రవితేజ చేసుంటే హిటయ్యేదా అంటే ఏమో అనే చెప్పాలి.