కొన్నేళ్ల క్రితం మొదలై, అనుకోని సంఘటనల వల్ల ఆగిపోయి.. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న అతి పెద్ద చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). ఎప్పుడో 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. తొలి పార్టు ప్రకారం అయితే భారతీయుడు సేనాపతి (Kamal Haasan) క్లైమాక్స్‌లో విదేశాలకు వెళ్లిపోతాడు. దీంతో రెండో పార్టులో కచ్చితంగా ఆయన స్వదేశానికి రావాల్సి ఉంది. అయితే ఎందుకు, ఎలా వస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్న.
‘భారతీయుడు 2’ సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే ఈ ప్రశ్న వినిపించింది. తొలి భారతీయుడు వచ్చినప్పటి కంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువ అవినీతి, లంచగొండితనం ఉంది అనేది జనాల మాట. మరి దీనిని ఎలా చూపిస్తారు, ఏం చెబుతారు అనేదే ఇక్కడ విషయం. ఇప్పుడు ఈ పాయింట్‌లో సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. దాని ప్రకారం చూస్తే సేనాపతిని ఇండియాకు తీసుకొచ్చేది సిద్ధార్థ్ (Siddharth) పాత్రేనట. సేనాపతి విదేశాల్లో ఉన్నప్పుడు మన దేశంలో అవినీతి రాజకీయాల పట్ల ఓ యువకుడు పోరాటం చేస్తుంటాడు.
అయితే అతనిని ఒంటరివాడిని చేసి లక్ష్యం చేసుకుని దాడి చేస్తారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ పాత్ర ప్రాణాలు పోవచ్చని గుర్తించిన సేనాపతి.. అతన్ని రక్షించడానికి భారతదేశంలో అడుగు పెడతాడు. అక్కడి నుండే సినిమా మొదలవుతుంది అని చెబుతున్నారు. వయసు మళ్లిన సమయంలో సేనాపతి వచ్చి ఏం చేశాడు అనేదే కథ. ‘శివాజీ’ (Sivaji) సినిమా తరహాలో ప్రభుత్వ వ్యవస్థలో డొల్లతనాన్ని చూపించే ప్రయత్నం చేశారట శంకర్ (Shankar).
అలాగే అతను వేసే శిక్షలు ఈసారి ప్రత్యేకంగా ఉంటాయట. ‘భారతీయుడు 2’ మ్యూజిక్ రిలీజ్ / ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 1న చెన్నైలో భారీ స్థాయిలో నిర్వహించనుంది. దానికి చిరంజీవి (Chiranjeevi) , రామ్‌చరణ్ (Ram Charan) ప్రత్యేక అతిథులుగా హాజరవుతారట. తమిళ హీరోలు చాలామంది కూడా వస్తారట. ఇక సినిమా జులై 12న వస్తుందని అంటున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది.