విజయ్ దేవరకొండ చేసిన ఓ సుదీర్ఘమైన వీడియో టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. ఆయన మీడియాను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి. నిరాధారమైన ఆరోపణలు చేసే కథనాలు రాసే పాత్రికేయులను ఆయన కొంచెం ఘాటుగానే విమర్శించాడు. ఇక విజయ్ వాదనకు టాలీవుడ్ లోని పెద్ద తలకాయలు చిరంజీవి, మహేష్ బాబు వంటి వారు సమర్ధించడం, నీ వెనుక మేము ఉన్నాం అని భరోసా ఇవ్వడంతో ఈ ఉద్యమం ఎక్కడికో వెళుతుంది అనుకున్నారు చాలా మంది. ఐతే ప్రస్తుతం దాని ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. టాలీవుడ్ లో గాసిప్ లు పుకార్లు సర్వసాధారణంగా ఎప్పటిలాగే కంటిన్యూ అవుతున్నాయి.
నిన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ప్రముఖ మీడియా ప్రతినిధిని ఉద్దేశిస్తూ, చివరకు మీరు కూడా ఇలాంటి గాసిప్ లు రాస్తున్నారా? మనకు పరిచయం ఉందిగా, అడిగితే చెబుతాగా అని సోషల్ మీడియా వేదికగా అవేదన వ్యక్తం చేశారు. ఎంత పెద్ద మీడియా సంస్థకు అయినా గాసిప్ రాయడం అనేది ప్రస్తుత పరిస్థితులలో అనివార్యం. ఎందుకంటే డైరెక్టర్స్ ప్రేక్షకులకు ఏమి కావాలో అదే ఎలా తెరకెక్కిస్తారో, మీడియా వారు కూడా పాఠకులకు ఏమి కావాలో అదే రాస్తారు. ఓ హాట్ గాసిప్ కి వచ్చిన వ్యూస్ లో సగం వ్యూస్ కూడా మంచి పదజాలంల ఉపయోగించి పెద్ద రీసెర్చ్ చేసి సుదీర్ఘంగా రాసిన వ్యాసానికి రావు. కారణం వాళ్లకు అదంతా అనవసరం, ఇన్స్టంట్ గా మెదడుకు రిలీఫ్ ఇచ్చే ఒక్క క్రేజీ గాసిప్ కావాలి.
ఇక విజయ్ ఎదో ఆవేశపడి కిల్ ఫేక్ న్యూస్ అన్నంత మాత్రాన ఇది ఆగేది కాదు. నిజానికి ఎప్పుడో ఒకసారి మీడియాలో ఇబ్బంది పెట్టే వార్తలు వచ్చినా ఎక్కువగా వారిని పొగుడుతూనే వార్తలు వస్తూ ఉంటాయి. చాలా మంది దగ్గరికి హీరోల గొప్ప విషయాలను మోసుకెళ్లే సాధనంగా మీడియా ఉంది. హీరోలకు గుర్తింపు వచ్చేదే మీడియా వలన. మీడియా-స్టార్లు ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిందే. అంతే కానీ హీరోల వల్ల డబ్బులు సంపాదించుకుంటున్న మీడియా అనడం సరికాదు.