కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సినిమాలో ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. ఎంత ఐటెం సాంగ్ అయినప్పటికీ.. కథలో భాగంగా వచ్చినప్పుడే బాగుంటుంది. కావాలని ఇరికించి పెడితే.. సాంగ్ ఎంత బాగున్నా.. ఆడియన్స్ కి కిక్ ఇవ్వదు. ఈ మధ్యాకాలంలో సినిమాలో ఎక్స్ట్రా జోష్ కోసం ఐటెం సాంగ్ ను సెట్ చేసుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది. ‘ఎఫ్3’ ప్లానింగ్ లో ఐటెం సాంగ్ లేదు. చివర్లో సినిమా అంతా అయిపోయిన తరువాత ఆ పాటను తీసుకొచ్చి ఇరికించారు.
అయితే అది పార్టీ సాంగ్ కావడం, దేవిశ్రీ మంచి ట్యూన్ ఇవ్వడం, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ నటించడం ఆ పాట బాగా వర్కవుట్ అయింది. సినిమా కూడా హిట్ అయింది. కాబట్టి ఆ పాట కోసం ఎంత ఖర్చు పెట్టినా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కోసం ‘సీసా’ అనే ఐటెం సాంగ్ ను చిత్రీకరించారు. ఇటీవల ఆ పాటను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాట కొంచెం క్యాచీగానే ఉంది.
అయితే ఈ పాటను కూడా చివరి క్షణాల్లో యాడ్ చేశారు. అది కూడా గ్లామర్ కోసమే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయినప్పటికీ ఎక్ట్రా గ్లామర్ కోసం.. అప్పటికప్పుడు ఈ పాటను సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ.
గ్లామర్ కి పెద్దగా స్కోప్ ఉండదు. దానికోసం చివరి నిమిషాల్లో అంజలిని తీసుకొచ్చారు. అంజలి రాకతో సినిమా ప్రమోషన్స్ కి కాస్త జోష్ వచ్చింది. కానీ ఇలా చివరి నిమిషాల్లో ఐటెం సాంగ్స్ ను యాడ్ చేయడం వల్ల నిర్మాతలకు ఇబ్బందిగా మారుతిండి. సినిమా హిట్ అయి లాభాలొస్తే ఓకే.. లేదంటే మాత్రం ఇంత ఖర్చు పనికిరాకుండా పోతుంది.