ఒకే రకమైన సినిమాలు చూసీ చూసీ బోర్ కొట్టినప్పుడు.. ‘అన్ని రకాల కథలు రావాలి’ అని అంటుంటారు. అయితే ఎంత చూసినా బోర్ కొట్టని జోనర్ అంటే కుటుంబ కథలు అనే చెప్పాలి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో కుటుంబ కథలు చాలానే వచ్చాయి. ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా ఇదే ప్రయత్నంలో వచ్చి అలరించిన చిత్రం ‘బలగం’. తెలంగాణలో మట్టి వాసన, కుటుంబ బంధాల పరిమళం ఏంటో చూపించిన చిత్రమిది. ఈ సినిమా వల్ల కొన్ని బంధాలు మళ్లీ తిరిగి కలిశాయి అని చెబుతున్నారు.
21 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా వల్ల కూడా ఇలానే కలిశారట. ఈ విషయాన్ని నటుడు జగపతిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘తెలుగులో కుటుంబ కథలు వచ్చి చాలా కాలమైంది. గతంలో వచ్చిన మా ‘శివరామరాజు’ మంచి కుటుంబ కథ. ఆ సినిమా చూశాక.. విడిపోయిన 24 పెద్ద కుటుంబాలు మళ్లీ కలిసిపోయాయి’’ అని జగపతిబాబు చెప్పారు. కుటుంబ కథల ప్రభావం అంత బలంగా ఉంటుంది అని ఆయన వివరించారు.
యాక్షన్, థ్రిల్లర్ సినిమాల హడావుడి ఎక్కువగా ఉన్న ఈ దశలో కుటుంబ కథని సిద్ధం చేసుకుని రావాలి అనిపించేది. ఆ సమయంలో తన దగ్గరకు ‘రామబాణం’ సినిమా కథ వచ్చిందని జగపతిబాబు తెలిపారు. మనుషుల మధ్య బంధాలు, సెంటిమెంట్స్ తగ్గిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి కథలు రావడం అవసరం. ఈ సినిమాను నేను అంగీకరించడానికి కూడా ఇదే కారణం అని చెప్పారు జగపతిబాబు. ఈ సినిమాలో సేంద్రీయ ఆహారం అనే అంశం కీలకమని సినిమాలో మెయిన్ పాయింట్ కూడా చెప్పేశారు.
స్వతహాగా తాను సేంద్రీయ వంటకాల్నే ఇష్టపడతానని చెప్పిన ఆయన.. మనం దురదృష్టవశాత్తూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులకి దూరంగా ఉంటున్నాం అని చెప్పారు. ఇక తాను దర్శకుల నటుడినని, కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే అని చెప్పారు. రెండో ఇన్సింగ్స్‌లో దాదాపు 80 పాత్రలు చేశాను అని చెప్పారు. అయితే అందులో చెప్పుకునే స్థాయిలో ఏడెనిమిది పాత్రలే ఉన్నాయి అని కూడా తెలిపారు. కొన్ని సినిమాల్లో తనను సరిగ్గా వాడుకోలేదని కూడా ఆయన అన్నారు.