సూర్య కెరీర్‌లో పీక్ స్టేజ్ అంటే.. ఇటీవల కాలమే అని చెప్పాలి. అంటే వసూళ్ల పరంగా ఆయన ఎంతో ఘనమైన సినిమాలు గతంలో చేసుండొచ్చు కానీ.. నటుడిగా సంతృప్తి నిచ్చే సినిమాలు, పురస్కారాలు అందించే సినిమాలు గత కొంతకాలంగానే చేస్తున్నారు. సూర్య అంటే కమర్షియల్ సినిమాలు అనుకునే స్థాయి నుండి.. సూర్య ఎలాంటి పాత్ర అయినా చేయగలడు అనే పరిస్థితి వచ్చింది. దీనికి రీసెంట్ ఉదాహరణలు ‘సూరారై పొట్రు’, ‘జై భీమ్’. అందులో రెండో సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది.
అవును మరోసారి సూర్య లాయర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఏడాది క్రితం ఓటీటీల్లోకి వచ్చిన ‘జై భీమ్’కు కొనసాగింపుగా సీక్వెల్‌ను తీసుకురాబోతున్నారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకకు ఆ చిత్ర దర్శకుడు త.శె. జ్ఞానవేల్, సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ హాజరయ్యారు. అక్కడ ‘జై భీమ్’ సినిమా సీక్వెల్ ప్రస్తావనరాగా.. కొనసాగింపు చిత్రం తప్పకుండా వస్తుందని తెలిపారు. దీంతో సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలో సూర్య పోషించిన జస్టిస్ చంద్రు నిజ జీవితంలో ఎన్నో కేసులను హ్యాండిల్ చేశారు. దీని బట్టి ‘జై భీమ్’ ఫ్రాంచైజీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ‘జై భీమ్’ తొలి సినిమా విషయానికొస్తే.. ప్రముఖ న్యాయవాది చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చేయని తప్పునకు జైలు పాలై, ప్రాణాలు కోల్పోయిన తన భర్త పరిస్థితి మరొకరికి రాకూడదని ఓ మహిళ చేసిన న్యాయపోరాటం ఆ సినిమా.
అయితే, తొలి సినిమాకు రెండో సినిమాకు కేవలం సూర్య మాత్రమే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే కేసు మారినప్పుడు కీలక పాత్రధారులు కూడా మారిపోతారు. తొలి పార్టులో లిజోమోల్ జోస్‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు రెండో పార్టులో అలా బాధితురాలి పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. ఇక సూర్య నుండి మరో బంపర్ హిట్ నటన ఎలాగూ వస్తుంది.