జై సింహా

  • January 12, 2018 / 06:18 AM IST

గతేడాది “గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్” చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన బాలకృష్ణ ఈ సంక్రాంతికి “జై సింహా”గా రంగంలోకి దూకాడు. తమిళ స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరీప్రియ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నేడు (జనవరి 12) విడుదలైంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు అలరించింది, బాలయ్య అభిమానులని ఎంతవరకూ సంతుష్టులను చేసిందీ మా సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ : నరసింహ (బాలకృష్ణ) అప్పుడే పుట్టిన పసికందును చంకనేసుకొని కుంభకోణం వస్తాడు. అక్కడి ఆలయ ధర్మకర్త (మురళీమోహన్) పంచన చేరి సాధారణ జీవనం సాగిస్తుంటాడు. అనుకోని సందర్భంలో కుంభకోణంలోని లోకల్ రౌడీ కనియప్పన్ (ప్రభాకర్)ను ఢీ కొంటాడు. అప్పుడే నరసింహ అందరూ అనుకొంటున్నట్లుగా మామూలు వ్యక్తి కాదని విశాఖపట్నంలో మినిస్టర్ మొదలుకొని నగర ప్రజల వరకూ ఎవరికీ సమస్య వచ్చినా ఆదుకొనే సింహం అని తెలుసుకొంటారు. అలాంటి నరసింహ కుంభకోణంలో కారు డ్రైవర్ గా ఎందుకు పనిచేస్తున్నాడు? విశాఖపట్నం నుంచి ఎందుకు వెళ్లిపోయాడు? అనేది “జై సింహా” కథాంశం.

నటీనటుల పనితీరు : “సింహా, లెజండ్” లాంటి చిత్రాల్లో బాలయ్యను చూస్తే “అబ్బా ఏం చేశాడ్రా” అని బాలకృష్ణ అభిమాని కాని వాడు కూడా మెచ్చుకొనేస్థాయిలో ఉండేది ఆయన నట విశ్వరూపం. ఆఖరికి “పైసా వసూల్” లాంటి సినిమాలో కూడా బాలయ్య తనదైన యాటిట్యూడ్ అండ్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు. కానీ.. “జై సింహా” విషయంలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ బాలయ్య నుండి సరైన స్థాయిలో నటన రాబట్టుకోలేదు అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లు, డ్యాన్స్ లలో బాలయ్య ఎనర్జీకి పేరు పెట్టలేమ్ కానీ.. సెంటిమెంట్ సీన్స్ లో మాత్రం బాలయ్య ఎమోషన్ ఇంకా పండితే బాగుండు అనిపిస్తుంది. సో, “జై సింహా”లో గర్జించే సింహంగా బాలయ్య సోసోగా మాత్రమే రాణించారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొంది. ముఖ్యంగా బాలయ్యతో కాంబినేషన్ సీన్స్ లో ఆమె ప్రదర్శించిన పరిణితిని మెచ్చుకోవాలి, అదే విధంగా మునుపెన్నడూలేనంతగా నయనతార ఈ చిత్రంలో మరింత అందంగా కనిపించడం విశేషం. ఇంకో ఇద్దరు హీరోయిన్లు నాటాషా దోషి, హరీప్రియాలు బాలయ్యతో చెరో పాటలో డ్యాన్స్ చేసి సైలెంట్ గా సైడైపోయారు. ప్రతినాయకులుగా “బాహుబలి” ప్రభాకర్, అశుతోష్ రాణా విలనిజాన్ని ఓ మోస్తరుగా పండించారు. మురళీమోహన్, ప్రియ, బ్రహ్మానందంలు తమ తమ పాత్రలకు న్యాయం చేయడానికి విశ్వప్రయత్నం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : చిరంతన్ భట్ సాంగ్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. “నీతోనే ఉంటా, అమ్మకుట్టి” పాటలు ప్రత్యేక ఆకర్షణలు. నేపధ్య సంగీతం మాత్రం సోసోగా ఉంది. అయితే.. యాక్షన్ సీన్స్ ని మాత్రం ఎలక్ట్రిక్ ట్యూన్స్ తో బాగా ఎలివేట్ చేశాడు. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలను ప్రతిబింబించగా.. యాక్షన్ సీక్వెన్స్ లను పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. వైజాగ్ రోడ్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ ను స్లోమోషన్ షాట్స్, డ్రోన్ షాట్స్ గా ఆసక్తికరంగా షూట్ చేశారు.

ప్రవీణ్ యాంటోనీ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చేది ట్విస్ట్ అనే విషయం ప్రేక్షకుడు తనలో తాను ఆలోచించుకొనేదాకా అర్ధం కాదు. ఇక సెకండాఫ్ లో చాలా సన్నివేశాలు ఎందుకొచ్చాయో ఎవరికీ అర్ధం కానట్లుగా ఉంటాయి. అందువల్ల ఫస్టాఫ్ ను ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెకండాఫ్ కి నీరసపడిపోతారు.

దర్శకుడు కె.ఎస్.రవికుమార్ సినిమా తెరకెక్కించిన విధానం ఆయన మునుపటి సినిమాల స్థాయిలో లేదు. అందుకు కారణం లేకపోలేదు.. మామూలుగా ఒక సినిమాని కనీసం సంవత్సరంపాటు తీసే అలవాటున్న కె.ఎస్.రవికుమార్ ని కంగారు పెట్టి కేవలం 90 రోజుల్లో పూర్తిచేయమని ఒత్తిడి చేయడంతో స్క్రీన్ ప్లేను సాగదీసేసి అయ్యిందనిపించాడు. ఆదేగనుక ఆయనకి తగినంత టైమ్ ఇచ్చి ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. అప్పటికీ ఒక దర్శకుడిగా తన సినిమాకి న్యాయం చేద్దామని విశ్వప్రయత్నం చేసినప్పటికీ.. ఎం.రత్నం సమకూర్చిన 80ల నాటి కథ, సాగతీత కథనం పుణ్యమా అని రవికుమార్ కూడా ఏమీ చేయలేక మిన్నకుండిపోయాడు.

విశ్లేషణ : బాలయ్య అభిమానులు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి, బాలయ్య ఎనర్జీటిక్ ఫైట్స్, డ్యాన్స్ ఉన్నాయి. కొన్ని ఎలివేషన్ షాట్స్ కూడా ఉన్నాయి. అయితే.. సరైన కథ లేదు. కథనం కూడా సగటు ప్రేక్షకుడు నెక్స్ట్ సీన్ ఎంటనేది అరగంట ముందే చెప్పే స్థాయిలో ఉంది. ఆ కారణంగా వీరాభిమానులు కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ.. మాస్ మసాలా అంశాలు ఎంజాయ్ చేసే ఒక వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల “జై సింహా” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus