థియేటర్లలో విజయం సాధించే సినిమా ఓటీటీలో విజయం సాధించాలని లేదు. అలాగే ఆ రెండింటిలో విజయం సాధించిన సినిమా టీవీల్లో హిట్ అవ్వాలని లేదు. ఈ మాట చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. దీనికి నిలువెత్తు ఉదాహరణలు చాలా చూశాం కూడా. తాజాగా మరో సినిమా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. థియేటర్లలో రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు అందుకున్న సినిమా టీవీలో 6 టీర్పీ రేటింగ్ కూడా అందుకోలేక చతికిలపడింది.
గతంలో థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న సినిమాలు టీవీల్లోకి వచ్చినప్పుడు అదే రేంజి విజయం అందుకునేవి. అక్కడి వసూళ్లకు సమానంగా ఇక్కడ టీర్పీలు అందుకునేవి. అయితే ఇటీవల కాలంలో ఓటీటీలు వచ్చాక ఆ స్థాయి ఉండటం లేదు. అయితే ఓ మోస్తరు టీర్పీలతోనైనా రాణించేవి. అలా రజనీకాంత్ ‘జైలర్’ సినిమా ఇటీవల బుల్లితెరకు వచ్చిన బావురమంది. కారణాలు తెలియవు కానీ సినిమాకు మొత్తంగా 5.4 టీర్పీ వచ్చింది అని సమాచారం.
‘జైలర్’ సినిమా తెలుగు వెర్షన్‌కు పట్టణాల్లో 6.3 టీర్పీ రాగా, అర్బన్ + రూరల్‌లో 5.4 టిఆర్పీ నమోదు కావడం గమనార్హం. ఆ సినిమా విజయం, ఆ హీరో సత్తాను చూస్తే ఈ టీర్పీ చాలా తక్కువే అని చెప్పాలి. ఈ సినిమా కంటే తక్కువ వసూళ్లు అందుకున్న సినిమాలు, డిజాస్టర్లకు కూడా కాస్త ఎక్కువే టీర్పీ వచ్చింది. ‘వీర సింహా రెడ్డి’, ‘బలగం’ లాంటి వాటికి 8కి పైగా టీఆర్పీ వచ్చింది. కానీ ‘జైలర్’కు అలా రాలేదు. అయితే తమిళంలో బాగానే ఉంటుందిలెండి.
అయితే దీనికి కారణం సినిమాను ఇప్పటికే థియేటర్లలో, ఓటీటీల్లో చాలాసార్లు చూసేయడమే అంటున్నారు. అందుకే టీవీ రైట్స్, టెలికాస్ట్ విషయంలో నిర్మాతల ఆలోచనలు మారాలని ఈ సినిమా సూచించింది అనుకోవచ్చు. థియేటర్లలో సినిమా తీసేసి, ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే టీవీలకూ తీసుకురావాలి. లేదంటే టీవీలకు ఏం మిగలదు అని అర్థమవుతోంది. మరి నిర్మాతలకు (Jailer) ‘జైలర్’ పాఠం ఎక్కుతుందో లేదో చూడాలి.