James Review: జేమ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 17, 2022 / 04:16 PM IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం “జేమ్స్”. ఆయన మరణానంతరం విడుదలవుతున్న సినిమా కావడంతో.. ఎనలేని ప్రత్యేకతను సంతరించుకుందీ చిత్రం. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పిన ఈ చిత్రం నేడు (మార్చి 17) విడుదలైంది. మరి పునీత్ ఆఖరి చిత్రం ఆయన అభిమానుల్ని అలరించగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: సంతోష్ (పునీత్ రాజ్ కుమార్) జేమ్స్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్. ఎదుట ఉన్నది ఎంతటి మొనగాడైనా ఎదురెళ్లడం అతని స్వభావం. గైక్వాడ్ ఫ్యామిలీకి మర్డర్ త్రెట్ ఉండడంతో సంతోష్ ను సెక్యూరిటీ గార్డ్ గా నియమించుకుంటారు. గైక్వాడ్ వారసురాలు నిషా (ప్రియా ఆనంద్) సంతోష్ ప్రేమలో పడుతుంది.

కట్ చేస్తే.. సంతోష్ అలియాస్ జేమ్స్ వచ్చింది గైక్వాడ్ ఫ్యామిలీని కాపాడడానికి కాదని, వాళ్ళని అంతమొందించడానికని తెలుస్తుంది. అసలు సంతోష్ అలియాస్ జేమ్స్ ఎవరు? గైక్వాడ్ ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “జేమ్స్” చిత్రం.

నటీనటుల పనితీరు: పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం కావడంతో.. సినిమాలో అతడిని నటుడిగా చూడడం కంటే ఆఖరిసారి తెరపై చూస్తున్నామన్న భావనే ఎక్కువగా కలుగుతుంది. నటుడిగా తన పాత్రకు 100% న్యాయం చేశాడు పునీత్. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు.

హీరోయిన్ గా ప్రియా ఆనంద్ పాత్ర పెద్ద గొప్పగా లేకపోయినప్పటికీ.. తన స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. శ్రీకాంత్, ఆదిత్య మీనన్, శరత్ కుమార్ లు విలన్లుగా ఆహార్యంతో ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు చేతన్ కుమార్ ఓ నాలుగైదు తెలుగు, తమిళ సినిమాలను మిక్స్ చేసి ఈ కథ రాసుకున్నాడు. ఫస్టాఫ్ “రామయ్య వస్తావయ్య”, సెకండాఫ్ కి వచ్చేసరికి కొన్ని చోట్ల “సరిలేరు నీకెవ్వరు” కనిపిస్తూ ఉంటుంది. అలాగే యాక్షన్ సీన్స్ కి కూడా చాలా తెలుగు, తమిళ సినిమాల రిఫరెన్సులు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల సినిమా చూసే తెలుగు ప్రేక్షకులు ఎక్కడా ఒరిజినాలిటీ ఫీల్ అవ్వరు.

దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నప్పటికీ, కథకుడిగా మాత్రం విఫలమయ్యాడు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్ ప్లే చేయడం సినిమాకి మరో ఎస్సెట్ గా నిలిచింది. అలాగే ఓపెనింగ్ సాంగ్ కి పాపులర్ కన్నడ సంగీత దర్శకులు మరియు హీరోయిన్స్ ను స్క్రీన్ పై కనిపించేలా చేసి ఆడియన్స్ ను అలరించాడు. సంగీతం, కెమెరా వర్క్ సోసోగా ఉన్నాయి. యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఇంకాస్త చక్కగా వర్కవుట్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ రిచ్ గా ఉంది.

విశ్లేషణ: సినిమాలో కథ పరంగా బోలెడన్ని మైనస్ లు ఉన్నప్పటికీ.. పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం కావడం, ఆయన అభిమానులు కోరుకొనే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండడం వల్ల సదరు మైనస్ లను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా చేశాయి. పునీత్ మీద అభిమానంతో, గౌరవంతో ఈ సినిమాను చూసేవాళ్ళకి అవేమీ కనిపించవు.

రేటింగ్: దివంగత పునీత్ మీద గౌరవంతో ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం లేదు!

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus