ప్రముఖ ఫిలిం ఫెస్టివల్ కాన్స్‌లో ఈ ఏడాది జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమా ఒకటి ప్రదర్శితనం కానుంది. ప్రపంచంలోని మేటి సినిమాలు అనిపించుకున్న వాటిని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అలా నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో రూపొందిన ‘హోమ్ బౌండ్’ అనే సినిమాను స్క్రీనింగ్ చేయనునర్నారు. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్ (Ishaan Khatter), జాన్వీ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ, అందులోని నటీనటులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
భారతీయ సినిమా ప్రపంచాన్ని ఆకర్షించే క్షణాలివి. 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘హోమ్ బౌండ్’ సినిమా సందడి చేయనుంది. ఇది మా టీమ్‌కు దక్కిన గౌరవం. కాన్స్ ప్రకటనతో మా మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఈ సినిమాను మీ అందరి ముందుకు తీసుకురావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఏడాది కాన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే.
ఈ సందర్భంగా సినిమా నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ‘భారతీయ సినిమా శక్తికి ‘హోమ్ బౌండ్’ ఓ నిదర్శనం అని రాసుకొచ్చారు. హైదరాబాద్‌కు చెందిన నీరజ్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం కూడా కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. 2015లో ఆయన ‘మసాన్’ అనే సినిమా తెరకెక్కించారు. రిచా చద్దా (Richa Chadha), విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ వేశారు.
ఇప్పుడు రెండో సినిమాతో కూడా నీరజ్ ఈ ఘనతను అందుకున్నారు. ఇక ఈ ఏడాది కాన్స్ ఫెస్టివల్ ఫ్రాన్స్ వేదికగా మే 13 నుండి 24 వరకు నిర్వహిస్తారు. అన్నట్లు ఈ సినిమాతో జాన్వీ, ఇషాన్ సుమారు ఏడేళ్ల తర్వాత కలసి నటిస్తున్నారు. వీరి తొలి సినిమా ‘ధడక్’. ఆ సినిమాతో ఇద్దరికీ పేరొచ్చినా.. జాన్వీ మాత్రమే స్టార్ అయింది.