జనరల్ సెక్రటరీగా జీవిత సక్రమంగా విధులు నిర్వర్తించలేదు అంటూ ఇటీవల నరేశ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూల్లో జీవితను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తాజాగా దీనిపై జీవిత స్పందించారు. నరేశ్ ప్యానల్‌లో జరిగింది ఇదీ అంటూ… మొత్తం విషయాలను ఏకరవు పెట్టారు. ఈ క్రమంలో అందరూ జీవిత, రాజశేఖర్‌లనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు అన్నారు జీవిత.
‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తానని మోహన్‌బాబు, నరేశ్, విష్ణుకు ముందే చెప్పా. గతంలో నేను, రాజశేఖర్ నరేశ్‌కు మద్దతిచ్చాం. కానీ ఆ తర్వాత మాకు.. నరేశ్‌కు విభేదాలు వచ్చాయి. ‘మా’ డైరీ విడుదల కార్యక్రమం తర్వాత మా మధ్య విభేదాలు ముదిరాయి అని చెప్పారు జీవిత. నరేశ్ అందరినీ కలుపుకు పోకపోవడం వల్లే సమస్యలొచ్చాయనేదే నా మాట. ఏ నిర్ణయం తీసుకునేముందు ఎవరితోనూ చర్చించకుండా… ‘మనం ఉన్నాంగా చాలు’ అనేవారు అని జీవిత వివరించారు.
అభిప్రాయ భేదాలున్నాయి కాబట్టి… ‘మా’ డైరీ విడుదలను సింపుల్‌గా చేద్దామని మేం సూచించాం. కానీ దాన్ని ఓ వేడుకలా చేశారు. అప్పుడే రాజశేఖర్ వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఎవరూ రాజశేఖర్‌కు సపోర్ట్ చేయలేదు. దీంతో రాజశేఖర్ రాజీనామా చేశారు. తిరిగి ఇప్పుడు మేమే తప్పు చేశామంటూ మమ్మల్ని అంటున్నారు అంటూ జీవిత చెప్పుకొచ్చారు. మరి ఈ మాటలకు నరేశ్ ఏమంటారో చూడాలి.